ArticlesNews

వీరమాతలు

99views

చరిత్రలో ఎందరో మాతృమూర్తులు తమ బిడ్డలను ధీరపురుషులుగా తీర్చిదిద్ది వీరమాతలై వెలిగారు. మహారాణులుగా వారు అంతఃపురాలకే పరిమితమైనా, సంతానాన్ని శీలవంతులుగా సంస్కరించడంలో విశేషంగా కృషి చేశారు. తెరవెనుక నిలిచినా పరోక్ష ప్రేరకులుగా తరిగిపోని స్ఫూర్తితో ప్రకాశించారు. మార్కండేయ పురాణంలో ప్రస్తావించిన రాణి మదాలస, మహాభారతంలో పరిచయమయ్యే విదుల తదితరులే అందుకు నిదర్శనం. పుత్రుల్ని సమర రంగానికి సంసిద్ధపరచడం దగ్గర నుంచి వారికి పారమార్థిక జ్ఞానాన్ని ప్రసాదించడం వరకు ఆ మహిళామూర్తులు ఘనమైన పాత్రను పోషించారు.

రాణి మదాలస యోగశాస్త్రాన్ని అభ్యసించి యోగినిగా మారింది. ఆత్మజ్ఞానాన్ని ఆర్జించి తన నలుగురు కుమారులను తేజోవంతులుగా మలచింది. జోలపాటలు పాడే నాటి నుంచే జ్ఞానబోధ చేస్తూ ‘శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి…’ – ‘నువ్వు పరిశుద్ధ ఆత్మస్వరూపుడవు, బద్ధుడవు కావు బుద్ధుడవు, నిత్య నిరంజనుడవు’ అంటూ మేల్కొలిపేది. అలా కుమారులను జాగృతపరచి, మహారాణిగానే కాదు ఆత్మజ్ఞానిగా కూడా జీవితాన్ని ధన్యం చేసుకుంది. సంతానానికి స్ఫూర్తి కలిగించడంలో ఆధునికతరం మాతృమూర్తులకూ ఆదర్శప్రాయం- విదుల. కొడుకు సంజయుడు సింధుదేశపు రాజు చేతిలో పరాజితుడై ఇంటికి చేరి, నిరాశతో దుఃఖించసాగాడు. అప్పుడు తల్లి విదుల ‘నాయనా! ఎందుకు ఆ నైరాశ్యం? యుద్ధంలో గెలుపోటములు సహజం. పొగలు గక్కే కట్టెలాగా చిరకాలం బతికేకన్నా, క్షణకాలం జ్వలించినా ప్రకాశాన్నిచ్చే నిప్పు కణికలా జీవించడం ఉత్తమం’ అని చైతన్యపరిచింది. ‘విజయమో, వీరమరణమో’ అంటూ కొడుక్కి వీరతిలకం దిద్ది సమరాంగణానికి సాగనంపింది. సంజయుడు అజేయుడై తిరిగి వస్తే సగర్వంగా స్వాగతం పలికింది.

ఆ మాతృమూర్తుల విజయగాథలను తలపించే మహిళామణులు నవభారతంలోనూ ఉన్నారు. తన ఆశల్నీ ఆకాంక్షల్నీ బాల శివాజీకీ ఉగ్గుపాలలో రంగరించిపోసింది జిజాబాయి. తల్లీతండ్రీ అన్నీ తానై శివాజీని పెంచింది. రాముడిలోని సహనం, అర్జునుడిలోని సాహసం కలగలిసిన గుణసంపన్నుడిగా తీర్చిదిద్దింది. తండ్రి కన్నా తల్లి దగ్గరే కొడుకు పరిపూర్ణుడుగా రూపుదిద్దుకుంటాడని నిరూపించింది. ‘భోగలాలస లేనివాడు, దేశం కోసం ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పించే యోధుడు, అశేష జనవాహినిని ముందుకు నడిపించగల ధీరుడు మన దేశానికి అవసరం. అలాంటి కొడుకును నేను ఈ భారతావనికి అందిస్తాను’ అని ఆమె ప్రతిన బూనింది. ఛత్రపతి శివాజీని భరతజాతికి బహూకరించి ధన్యచరితగా మిగిలింది.

స్వామి వివేకానంద తల్లి భువనేశ్వరీదేవి కూడా కుమారుడి మహోన్నతమైన వ్యక్తిత్వంపై ప్రగాఢ ముద్రవేశారు. స్వామీజీ రామాయణ భారతాది ఇతిహాసాలు, పురాణాల్ని మాతృమూర్తి నుంచే ఆలకించారు. వివేకానందకు విలువల పాఠాలు నేర్పిన తొలిగురువు తల్లే. అందుకే ‘మా అమ్మ ప్రార్థనల ఫలమే నేను. నాకోసం ఆమె ఎన్ని పూజలు చేసిందో! ఎన్ని నోములు నోచిందో! నన్నీ లోకంలోకి తీసుకురావడానికి ఒక యోగినిలా మారింది. నా జీవితం, ప్రఖ్యాతి మా అమ్మ పెట్టిన భిక్ష’ అని ఓ ప్రసంగంలో ఉద్వేగభరితుడయ్యారు.