ArticlesNews

పుల్లరి పోరాట వీరుడు కన్నెగంటి హనుమంతు

111views

( ఫిబ్రవరి 26 – కన్నెగంటి హనుమంతు వర్ధంతి )

ఎంతో మంది విప్లవకారులను స్వాతంత్య్రోద్యమంలో వెన్నుతట్టి నడిపిన స్ఫూర్తి కన్నెగంటి హనుమంతు. శరీరంలోకి 24 గుండ్లు దూసుకెళ్ళిన తరువాత కూడా సుమారు కొన్ని గంటలపాటు మాతృమూర్తి దాస్య శృంఖలాలను తెంచడానికి బ్రిటిష్ సైన్యంతో పోరాడిన ధీరుడు కన్నెగంటి హనుమంతు. పుల్లరి చెల్లింపును ధిక్కరిస్తూ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన నాయకుడు. కన్నెగంటి హనుమంతుకి జన్మనిచ్చింది మించాలపాడు అనే ఓ కుగ్రామం. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని దుర్గికి సమీపంలోని కోలెకుట్ట శివారు ప్రాంతమే మించాలపాడు. 1870వ సంవత్సరంలో ఓ సామాన్య కుటుంబములో వెంకటయ్య, అచ్చమ్మ దంపతులకు ద్వితీయ సంతానముగా జన్మించాడు హనుమంతు. అది 1920వ సంవత్సరం. దేశమంతా గాంధీజీ పిలుపుతో సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొంటోంది. గుంటూరు జిల్లాలో ఉన్నవ లక్ష్మీనారాయణ గారు దీనికి నాయకులు.

పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, వెల్దుర్తి, జట్టిపాలెం, రెంటచింతల వంటి ప్రాంతాల్లో ప్రజాజీవనం ఆ ప్రాంతపు అడవులతో ముడిపడి ఉంది. 1921 సంవత్సరం ప్రాంతంలో పల్నాడులో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. పరాయి పాలనలో సామాన్య ప్రజలకు కూడు, గుడ్డ వంటి కనీసావసరాల మాట దేవుడెరుగు కనీసం పశువులకు గ్రాసం, గ్రామ జీవితంలో భాగమైన కట్టెలు కొట్టుకోవడం, ఆకూ అలమూ పోగుచేసుకోవడం వంటి వాటికి సైతం బ్రిటిష్ ప్రభుత్వం ప్రజలపై ఆంక్షలు విధించింది. అడవిలో పశువుల్ని మేపుకోవడానికీ, కట్టెలు కొట్టుకోవడానికీ ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వానికి పుల్లరి చెల్లించాలనే నిబంధన విధించింది. దరిమిలా ప్రభుత్వాధికారులు మేతకు వచ్చిన పశువుల్ని బందెలదొడ్డికి తోలడం, ప్రజలు వాటిని విడిపించుకోవడానికి నానా అవస్థలూ పడటం పరిపాటయిపోయింది.

బ్రిటిష్ నిరంకుశ పాలనలో భారతీయులు అనుభవిస్తున్న అవస్థలను, అవమానాలను చూసి రగిలిపోయిన కన్నెగంటి హనుమంతు పోరుబాట పట్టాడు. అనేక మంది యువకులను కలుపుకొని ఒక దండుగా కదిలాడు. తెల్లవారిపై దండయాత్ర చేశాడు. బ్రిటిష్ జనరల్ టి. జి. రూథర్ ఫర్డ్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ వెర్నర్ కొంత మంది స్థానిక వంచకులను చేరదీశాడు. ఎప్పటికప్పుడు కన్నెగంటి కదలికలు తెలుసుకొని ఆయనను మట్టుబెట్టాలని ప్రయత్నాలు చేశాడు. తమ వీరబిడ్డడు కన్నెగంటిని ప్రజలే కంటికి రెప్పలా కాపాడుకున్నారు. దాంతో బ్రిటిష్ జనరల్ టి. జి. రూథర్ ఫర్డ్ మరో కుట్ర పన్నాడు. కన్నెగంటిని ప్రలోభాలతో లొంగదీయాలని తలపోశాడు.

దుర్గి ఫిర్కకు కన్నెగంటిని జమిందార్‌గా చేస్తామంటూ కరణం ద్వారా వర్తమానం పంపాడు. ఇష్టం వచ్చినంత శిస్తు వసూలు చేసుకోవచ్చని ఆశ పెట్టారు. కానీ నిష్కళంక దేశభక్తుడైన కన్నెగంటి తాను తార్పుడు గాడిని కాననీ, తోటి భారతీయులను వంచించి నెత్తుటి కూడు తినననీ తెగేసి చెప్పాడు.

1922 ఫిబ్రవరి 26 మధ్యాహ్నం మహాశివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని ముటుకూరు లింగం కోటయ్య అధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభ కోటప్పకొండకు బయలుదేరింది. అదే అదనుగా భావించిన బ్రిటిష్ సేనలు మించాలపాడు గ్రామాన్ని దిగ్బంధం చేశాయి. పశువులను మందగా చేసి తోలుకు పోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అడ్డువచ్చిన వారిని తుపాకి మడమలతో కొట్టి హింసించారు. విషయం తెలుసుకొని, అధికారులతో మాట్లాడి పుల్లరి చెల్లించి రావడానికి కన్నెగంటి ఆ దిశగా బయలుదేరారు. “ఆగండి. ఎవరినీ హింసించకండి. పుల్లరి చెల్లించడానికి మేము సిద్దం” అని ఆయన సైగలు చేస్తున్నా…. వారు లక్ష్య పెట్టలేదు. కన్నెగంటిపై కాల్పులు జరిపారు. 26 తూటాలు ఆయన శరీరంలోకి దూసుకుపోయాయి. రక్తం మడుగులో పడి ఉన్న కన్నెగంటి చుట్టూ బ్రిటిష్ సేనలు వలయంలా నిలబడి గ్రామస్తులను దరిచేరనివ్వలేదు. తమ ప్రియతమ నాయకుడికి గ్రామస్థులు మంచి నీరు ఇవ్వబోగా బ్రిటిష్ తొత్తులు అడ్డుకున్నారు. హనుమంతు భార్య గంగమ్మ తెచ్చిన నీటిని కూడా నేలపాల్జేశారు. ఈ దాష్టీకం సహించలేని గ్రామస్థులు కారం, బరిశలు, విల్లంబులతో తిరగబడ్డారు. కానీ సర్కారు సేనల పశుబలం ముందు నిలవలేకపోయారు. బ్రిటిష్ సేనలు ఆ రాత్రంతా గ్రామం పైబడి దోచుకున్నారు.

సాయంకాలం 6 గంటలకు తుపాకి తూటాలకు గాయపడిన పల్నాడు సింహం కన్నెగంటి అర్థరాత్రి వరకూ శక్తి కూడదీసుకొని ‘వందేమాతరం’ ‘వందేమాతరం’ అని నినాదాలు చేస్తూనే ఉన్నాడు. అర్థరాత్రి దాటాక ఆ పల్నాటి వీరబిడ్డడు అమరుడయ్యాడు. దేశభక్తిని, పౌరుష పరాక్రమాలను మేల్కొల్పగల వేలాది ధీరోదాత్త, త్యాగశీల, మహోన్నత భారతి ప్రియసుతులలో కన్నెగంటి హనుమంతు ముందువరుసలో ఉంటారు.