
విశాఖ జిల్లా అనకాపల్లిలోని మాధవ విద్యా విహార్ పాఠశాల 42వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయులు శ్రీ పెనుమటి అప్పారావు అధ్యక్షత వహించారు. సభను ఉద్దేశించి శ్రీ విల్లూరి శ్రీనివాస రావు మాట్లాడుతూ శ్రీరామ నగర్, విజయరామరాజుపేట పరిసర ప్రాంత విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తూ ఉన్నందుకు మాధవ విద్యా విహార విద్యాలయం మొదటగా ప్రశంసార్హమైదన్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ విద్యాలయాలు కూడా అందించ లేనంత నాణ్యమైన విద్యను అందించడమే కాక విద్యా విషయాలతో పాటు పిల్లలకు యోగ, సంస్కృతం, సంగీతం వంటి వాటిలో శిక్షణ ఇస్తూ నైతిక, ఆధ్యాత్మిక విషయాలను సైతం బోధిస్తూ పిల్లలను ప్రయోజకులుగా, దేశభక్తులుగా తీర్చిదిద్దుతూ మాధవ విద్యా విహార ఒక ఆదర్శవంతమైన పాఠశాలగా రూపుదిద్దుకున్నది అన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ నూకల అప్పలరాజు పాఠశాల వార్షిక నివేదికను సభకు సమర్పించారు.
కార్యక్రమంలో బాల బాలికలు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో ఆహూతులను అలరించారు.
వి మాడుగుల పంచాయితీ కార్యనిర్వహణాధికారి శ్రీ చదరం బాబురావు, ఆర్ ఎస్ ఎస్ నగర ధర్మ జాగరణ ప్రముఖ శ్రీ కరణం నూకు నాయుడు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీ జోగి నాగేశ్వరరావు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. బాలబాలికలకు బహుమతి ప్రదానం గావించారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది.