
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌లోని జాలి కోఠిలో ఉన్న నాదిర్ అలీ భవనంలో నివసిస్తున్న ఒక మహిళ ఆమె కుమార్తె గత ముప్పై సంవత్సరాలుగా భారతదేశంలో ఎలాంటి పౌరసత్వం లేకుండా నివసిస్తున్నారు. ఈ విషయంపై రుక్సానా అనే మహిళ పోలీసులకు ఫిర్యాదునివ్వగా వారిపై ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళితే నాదిర్ అలీ భవనంలో ఆనమ్ ఫర్హత్ అనే మహిళ, ఆమె తల్లి సాబా నివసిస్తున్నారు. వారు అసలు భారతదేశానికే చెందిన వారుకారంటూ రుక్సానా అనే మహిళ పోలీసులకు ఫిర్యాదుచేసింది.
ఫర్హత్ మసూద్ (ఆనమ్ ఫర్హత్ తండ్రి) 1988లో పాకిస్తాన్కి చెందిన సబా అలియాస్ నాజీని వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. సాబా 1993లో పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లింది. ఆమె నాల్గవ కుమార్తె అనమ్ ఫర్హత్ మే 1993లో అక్కడే జన్మించింది. ఆ తర్వాత, వారు భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆ సమయంలో ఆమె పాకిస్తాన్ పాస్ పోర్టు ఆధారంగా భారత్ కి వచ్చింది. ఆనమ్ మీరట్ లో ఉన్న ఒక కంటోన్మెంట్ పాఠశాలలో పనిచేస్తోంది. భారత పౌరసత్వాన్ని పొందలేదు. ఆమె తల్లి, ఆమె పాకిస్తాన్ పౌరులుగానే ఉన్నారు. అంతేకాకుండా నకిలీ పత్రాలను ఉపయోగించి పాస్పోర్టు కూడా సంపాదించారు. నకిలీ పాస్‌పోర్ట్‌లను ఉపయోగించి తల్లి, కుమార్తె అనేకసార్లు విదేశాలకు వెళ్లారు. ఇక పాకిస్తాన్‌లో నివసిస్తున్న సబా తండ్రి హనీఫ్ ఒక ISI ఏజెంట్ అని రుక్సానా ఆరోపిస్తోంది. ఢిల్లీలోని సమాచార మంత్రిత్వ శాఖ చుట్టూ ఉన్న సైనిక ప్రాంతంలో ఈ ఇద్దరు తల్లీ కూతుర్లు తరచుగా తిరుగుతుంటారనీ, వారు పాకిస్తాన్ కి సమాచారాన్ని చేరవేస్తున్నారనీ ఆమె ఆరోపించారు. ఈ వివరాల ఆధారంగా పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు. తదుపరి విచారణను కొనసాగిస్తున్నారు.





