రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్( ఆర్ఎస్ఎస్) దైనందిన కార్యక్రమాల్లో భాగమైన శాఖ ఎంతో కాలంగా ఆంధ్రా విశ్వవిద్యాలయం మైదానంలో ప్రశాంతంగా జరుగుతోంది. ఆర్ఎస్ఎస్‌కు వందేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగానూ, విశాఖ నగరంలోనూ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఎస్ఎస్ ఎదుగుదలను సహించలేని కొన్ని శక్తులు మంగళవారం రాత్రి ఆంధ్ర విశ్వవిద్యాలయం బాస్కెట్ బాల్ కోర్టు వద్ద జరుగుతున్న శాఖ పై దాడి చేశాయి. దాడి జరుగుతున్న సమయంలో స్వయంసేవకులు భారతమాతను కీర్తిస్తూ ప్రార్థన చేస్తున్నారు. భారత్ మాతాకీ జై అంటూ ప్రార్థన చేస్తుండగా కొందరు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా నినాదాలతో కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సంఘ కార్యకర్తలు సమయమనం కోల్పోలేదు. పోలీసుల సమక్షంలో ఇదంతా జరిగింది. అయితే విచిత్రంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విశ్వవిద్యాలయంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ కవాతు చేశారంటూ కొన్ని వర్గాలు విష ప్రచారానికి తెర తీశాయి. ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలన్నీ చట్టానికి లోబడి శాంతియుతంగానే జరుగుతాయి. ఎక్కడ హింసకు, విద్వేషాలకు తావు ఉండదు. ప్రశాంతంగా ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న శాఖపై దాడికి పాల్పడిన వారే ఆర్ఎస్ఎస్ తమపై దాడి చేసిందంటూ తప్పుడు ప్రచారం చేయడం బాధాకరం. ఆర్ఎస్ఎస్ శాఖపై దాడి జరిగిందని తెలుసుకొని విశ్వవిద్యాలయంలోని ఏబీవీపీ విద్యార్థులు సంఘటనా స్థలానికి వచ్చి అండగా నిలబడ్డారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బుధవారం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. విశాఖతో పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రశాంతంగా ఉండాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంటుంది.ఎటువంటి హింసకు ఆర్ఎస్ఎస్ అవకాశం ఇవ్వదని మరోమారు స్పష్టంగా తెలియజేస్తున్నాం.
– పివి నారాయణరావు
విశాఖ మహానగర సంఘచాలక్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్





