News

నల్లమల అటవీ సంరక్షణ అందరి బాధ్యత

121views

నల్లమల అడవి అందరిది అని, సంరక్షణ బాధ్యత విషయాన్ని తప్పక గుర్తించాలని నాగార్జునసాగర్‌ – శ్రీశైలం పులుల అభయారణ్యం ఫీల్డ్‌ డైరెక్టర్‌ విజయకుమార్‌ అన్నారు. బుధవారం ఆయన ఆత్మకూరు డివిజన్‌లోని శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్న శివభక్తులను కలసి అటవీ సంరక్షణ గురించి వివరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీశైలానికి భక్తులు కాలినడకన వెళ్లడం ఒక పురాతన ఆధ్యాత్మిక కార్యక్రమన్నారు. అటవీ చట్టాలను అమలయ్యే సమయంలోనే ఈ పాదయాత్ర మార్గంలో శివరాత్రి, ఉగాది పర్వదినాల్లో భక్తులు వెళ్లేందుకు హక్కు కల్పించారన్నారు. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో అటవీ రక్షణకు చర్యలు చేపట్టక తప్పని పరిస్థితి నెలకొందన్నారు. అడవుల్లోకి ప్లాస్టిక్‌ను పకడ్బందీగా నివారించాల్సిన బాధ్యత అటవీశాఖపై ఉందన్నారు. భక్తులు అడవిలో పారవేసే ప్లాస్టిక్‌ వస్తువులను వన్యప్రాణులు తిని మృత్యువాత పడుతాయన్నారు. కేవలం 30 శాతం సిబ్బందితోనే అటవీ సంరక్షణ చర్యలు చేపడుతున్నామని, ఈ విషయాన్ని భక్తులు గమనించి అటవీ శాఖకు సహకరించాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పర్యావరణ పరిరక్షణ విషయాలు చర్చించారు