
తెలంగాణాలోని నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెం-వీరప్పగూడెం గ్రామాల దక్షిణ సరిహద్దుల వెంట ప్రవహిస్తున్న కృష్ణా నది ఎడమ ఒడ్డున ఒక పురాతన నగర శిథిలాలను గుర్తించినట్లు ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ వెల్లడించారు.
ఆయన తెలిపిన ప్రకారం… ‘పురావస్తు ఆధారాలను బట్టి ఈ నగరం సుమారు 3 వేల సంవత్సరాల క్రితం నుంచి క్రీ.శ.15వ శతాబ్దం వరకు నిరంతరంగా మనుగడ సాగించినట్లు తెలుస్తోంది. ఈ ప్రదేశంలో ఇనుప యుగానికి చెందిన వందల బృహత్ శిలా సమాధులు(కెయిరన్లు) ఉన్నాయి. అవి వీరుల సమాధులని స్థానికులు నమ్మడంతోనే ఈ ప్రాంతానికి వీరులపాడు, వీరప్పగూడెం అనే పేర్లు వచ్చాయి. పలుచోట్ల లభించిన ఇనుప చిట్టాలను బట్టి ఇక్కడ ఇనుము తయారు చేసేవారని తెలుస్తోంది.
ఈ వీరులపాడు స్థలం ఇప్పటివరకు పురావస్తు శాఖ దృష్టికి రాలేదు. మధ్యయుగ కాలం(క్రీ.శ.10-15 శతాబ్దాలు)లో నిర్మితమైన కోట గోడలు, బురుజులు, ధాన్యాగారాలు, ఆలయాలు, బావులు, ఇళ్లు, శిల్పాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సిమెంటు కంపెనీ కార్యకలాపాలు, స్థానికుల చర్యల వల్ల అవి వేగంగా నశిస్తున్నాయి. ఈ చారిత్రక వారసత్వం పూర్తిగా అంతరించిపోకముందే కనీసం డాక్యుమెంటేషన్ అయినా చేయాలి’ అని ఆయన పురావస్తు శాఖను కోరారు.





