ArticlesNews

సనాతన ధర్మ ప్రకాశకులు స్వామి దయానంద

147views

( ఫిబ్రవరి 12 – స్వామి దయానంద సరస్వతి జయంతి )

పరాయి పాలనలో మగ్గుతున్న దేశాన్ని బానిసత్వపు శృంఖలాల నుంచి విడిపించి, సమాజాన్ని బాగుపరచడానికి ఎన్నో సంస్కరణలు చేపట్టి నవీన భారతదేశ సంస్కర్తలలో అగ్రగణ్యులుగా నిలిచారు స్వామి దయానంద సరస్వతి. ఈయన ఫిబ్రవరి 12, 1824న గుజరాత్‌ ‌కఠియావాడ్‌ ‌ప్రాంతంలోని ఠంకారా గ్రామంలో జన్మించారు. తల్లి పేరు శుద్ద చైతన్య, తండ్రి పేరు ర్సన్‌ ‌దాస్‌ ‌తివారీ. దయానందుల అసలు పేరు మూల శంకర్‌. చిన్ననాడే భగవంతుడ్ని దర్శించాలనే తలంపుతో ఇల్లు వదలి వెళ్లి మధురలోని విరజానంద సరస్వతుల వద్దకు చేరారు. వారి సాన్నిధ్యంలో వేద, వేదాంత విద్యలను అభ్యసించి, సమాజం పట్ల అవగాహన రావడానికి గురువుల అనుమతితో దేశాటనకు బయలుదేరారు. ఆనాటి సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను చూసి చలించిన దయానంద తన జీవితం ఇక సమాజసేవకే అంకితమని నిశ్చయించుకున్నారు.

బ్రిటిష్‌ ‌పాలనలోని భారతదేశంలో హిందువులు బానిసత్వానికి తోడుగా అనేక సామాజిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన దేశం, సనాతన ధర్మం ఇప్పుడు స్వీయ నాశనం దిశగా వెళ్లడాన్ని చూసి చలించిపోయాడు దయానందుడు. ఈ దురావస్థల నుంచి బయటకు తీసుకురావడం ఎలా అని ఆలోచించారు. ఈ ప్రయత్నంలో మార్చి1, 1867లో ‘పాఖండ ఖండిని’ పతాకాన్ని ఆవిష్కరించారు. దురాచారాలపై పోరాటం ప్రారంభించారు. ఈ సంస్కరణలు నాటి బ్రాహ్మణ పూజారులు, పండితులకు ఆందోళన కలిగించాయి. అయితే ప్రతి ఒక్కరితో ఎంతో ఒపికగా చర్చించి ఒప్పించే వారాయన. తన పర్యటనలో స్వామిజీ ఎంతోమంది శిష్యులను సమకూర్చుకున్నారు.

దయానంద 10 ఏ‌ప్రిల్‌ 1875న, బొంబాయిలో ‘ఆర్యసమాజ్‌’ ‌స్థాపించారు. ఆర్యులు అంటే శ్రేష్టులు. శ్రేష్టులతో కూడిన సమాజ నిర్మాణమే ఆర్యసమాజ్‌. ‌కృణ్వంతో విశ్వమార్యం అనేది ప్రధాన నినాదం. భగవంతుడు నిరాకారుడని చాటింది ఆర్యసమాజం. సర్వ వ్యాపకుడైన భగవంతునికి విగ్రహారాధన వద్దని చెప్పారు దయానంద. చతుర్వేదాలు అందరికీ ప్రామాణికాలని చెప్పి, ప్రతి ఒక్కరూ వీటిని అధ్యయనం చేయాలని పిలుపిచ్చారు. ఇందులో స్త్రీ, పురుష వివక్షత లేదు. అగ్ర, నిమ్న కులాల తేడా లేదు. అన్నివర్గాలు యజ్ఞోపవీత ధారణ, గాయత్రీ పఠనం, యజ్ఞం చేయవచ్చని ప్రోత్సహించారు. స్త్రీ, పురుష భేదం లేకుండా అన్ని కులాల వారు పౌరోహిత్యం చేయవచ్చని పిలుపునిచ్చిన దయానంద, దీన్ని ఆచరణలో చూపించి సంచలనం సృష్టించారు. వితంతు వివాహాలను స్వాగతించారు. కులాంతర వివాహాలకు ఆర్యసమాజ్‌ ‌మారు పేరుగా నిలిచింది. ఆర్యసమాజ్‌ ఆధ్వర్యంలో దేశంలో పలు చోట్ల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా బాలికా విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

వేదాలు మానవులు రచించినవి కావనీ, సాక్షాత్తూ పరమాత్మ నుండే ఉద్భవించాయని బలంగా నమ్మిన వీరు ‘సత్యార్థ్‌ ప్రకాశ్‌’ పేరుతో వేదాల సారాన్ని సామాన్యుడి దాకా చేర్చే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా వేదాలను ఆధునిక కోణంలో చూడాలన్న దృక్పథంతో వేదాలకు వీరు రాసిన భాష్యం ‘దయానంద భాష్యం’ పేరుతో సుప్రసిద్ధమైంది. వేదాలు చెప్పిన స్త్రీ సమానత్వం గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. వేదాలతో పాటు ప్రాథమిక విద్య అవసరాన్ని గుర్తించి అనేక కళాశాలలు నెలకొల్పి విద్యాదానం చేశారు. సత్యమే ప్రమాణంగా ప్రచారం చేసిన దయానంద ఎంతోమందికి కంట్లో నలుసుగా మారారు. ఎన్నోసార్లు విషప్రయోగాలు జరిగినా హఠయోగం ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. జోధ్‌పూర్‌ ‌మహారాజా ఆహ్వానం మేరకు అతిథిగా వెళ్లారు దయానంద అక్కడి వంటవాడు విషం కలిపిన పాలు ఇవ్వడంతో అస్వస్థతకు గురయ్యారు. స్వామీజీ అక్టోబర్‌ 30, 1883 న ఓంకార నాదంతో మహా సమాధి పొందారు. జాతీయవాదిగా తన బోధనలతో భారతదేశాన్ని సాంఘికంగా, మతపరంగా సంఘటిత పరచి ప్రజలలో దేశభక్తిని, జాతీయభావాన్ని పెంపొందించేలా అవిరళ కృషి సల్పి, హిందూధర్మానికి దయానందులు చేసిన సేవ తరువాతి సమాజ సంస్కర్తలకు ఆదర్శంగా నిలిచింది.