News

జనగణమన కంటే ముందు వందేమాతరం ఆలపించాలి: కేంద్రం

152views

అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో ఇక నుంచి జాతీయ గీతం జనగణమన కంటే ముందుగా జాతీయ గేయం వందేమాతరం ఆలపించాలని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త నిబంధలను అమల్లోకి తెచ్చింది. వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో అందరూ లేచి నిలబడాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాకుండా అన్ని పౌరపురస్కారాలు ఇచ్చే సమయంలో, రాష్ట్రపతి హాజరయ్యే అన్ని కార్యక్రమాల్లో వందేమాతరం ఆలపించాలని తెలిపింది. అయితే సినిమా హాళ్లలో దీనిని ప్రదర్శించాల్సిన అవసరం లేదని నిబంధనల్లో పేర్కొంది. జాతీయ గీతం, గేయం పాడుతుండగా.. అంతరాయం కలిగించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. కొత్త నిబంధనల కింద బాధ్యులకు గరిష్ఠంగా మూడేళ్ల జైలుశిక్ష విధించనున్నారు.

ఇదిలా ఉంటే.. బంకించంద్ర ఛటర్జీ తొలుత 1875లో వందేమాతరాన్ని రచించారు. తర్వాత తన ఆనంద్‌మఠ్‌ నవలలో దీన్ని భాగం చేశారు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ఉత్తర్వులు వచ్చాయి. అందులో ఆరు చరణాలను పాడాలని కేంద్రం పేర్కొంది. వాటిని 3 నిమిషాల 10 సెకన్లలో ఆలపించాలి. స్వాతంత్ర్య పోరాట సమయంలో ముస్లింలీగ్ అభ్యంతరాల మేరకు.. ఆరు భాగాల్లోంచి ఎలాంటి మతపరమైన ప్రస్తావనా లేని తొలి రెండింటిని మాత్రమే కాంగ్రెస్‌ స్వీకరించింది. స్వాతంత్య్రానంతరం నెహ్రూ ప్రభుత్వం వివాదంలేని తొలి రెండు భాగాలతో.. వందేమాతరాన్ని జాతీయ గేయంగా ప్రకటించింది.