News

ఫిబ్రవరి 26 నుంచి తిరుమల శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు

164views

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2వ తేదీ వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అధికారులు వివరించారు.

తెప్పోత్సవాల్లో భాగంగా తొలిరోజు ఫిబ్రవరి 26న సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారని వివరించారు. ఫిబ్రవరి 27న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి, 28న శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి దర్శనమిస్తారని వెల్లడించారు. మార్చి 1న ఐదుసార్లు, చివరి రోజు మార్చి 2న ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో మలయప్ప స్వామి విహరించి భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు.

ఆర్జిత సేవలు రద్దు ..
తెప్పోత్సవాల కారణంగా ఫిబ్రవరి 26, 27 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, ఫిబ్రవరి 28న, మార్చి 1, 2వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసిందని సంబంధిత అధికారులు వెల్లడించారు.