News

తీరం భద్రతకే ‘సైక్లోథాన్‌’

109views

తీర ప్రాంత భద్రత, దేశ భక్తి, పర్యావరణ పరిరక్షణ పట్లపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ధ్యేయంగా సీఐఎస్‌ఎఫ్‌ (సెంట్రల్‌ ఇండస్ర్టీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌) ఆధ్వర్యంలో వందేమాతరం కోస్టల్‌ సైక్లోథాన్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ఎ.ఆర్‌.దామోదర్‌ తెలిపారు. శ్రీకాకుళం వైపు నుంచి విశాఖ వైపు వెళ్తున్న సైక్లోథాన్‌ సైకిల్‌ ర్యాలీ జిల్లాలోకి ప్రవేశించింది. ఈ ర్యాలీకి స్థానిక జాతీయ రహదారిపై ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ఘన స్వాగతం పలికారు. వందేమాతరం, భారత మాతకు జై, జై భారత్‌ అనే నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తి పోయింది. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సీఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో రెండు బృందాలు తొమ్మిది రాష్ర్టాల గుండా సుమారు 6,553 కిలో మీటర్ల మేర తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల్లో ఉన్న 52 తీర గ్రామాల్లో సైకిల్‌ ర్యాలీ ద్వారా పర్యటించనున్నట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌ బఖాళి నుంచి తూర్పు తీరానికి ఒక బృందం, పశ్చిమ తీరంలో ఒక బృందం ఈ ర్యాలీని ప్రారంభించాయన్నారు. ఈ ర్యాలీ గతనెల 28న ప్రారంభమైందన్నారు. 25 రోజుల పాటు సాగి ఈ నెల 22న కేరళలోని కొచ్చిన్‌ తీరంలో ముగుస్తుందన్నారు. ఈ బృందంలో సీఐఎస్‌ఎఫ్‌కి చెందిన 136 మంది సభ్యులు ఉన్నారని అన్నారు. తీరం వెంట అపరిచిత వ్యక్తులు, పడవలు, అనుమానితులు ఎవరైనా కనిపిస్తే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే దేశ భద్రతకే ముప్పు ఏర్పడే ప్రమాదముందని అన్నారు.