
విశాఖపట్నంలోని ఆంధ్రవిశ్వవిద్యాలయం చరిత్ర విభాగంలోని పురావస్తుశాస్త్ర మ్యూజియానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎన్నో చారిత్రక సాక్ష్యాలకు ఇది నిలయం. పురాతన కాలం నాటి వస్తువులు, శిలా శాసనాలు, నాణేలు, ఆదిమానవులు వినియోగించిన వస్తువులు ఇక్కడ కనిపిస్తాయి. సంబంధిత ఆచార్యుల అనుమతితో మనమూ చూడొచ్చు.
ఏరాజు ఏమి చేశాడంటే..: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన తవ్వకాల్లో బయల్పడిన చారిత్రక ఆధారాలను ఈ మ్యూజియంలో పొందుపరిచారు. వాటిల్లో 11, 12, 13వ శతాబ్దాల్లో పాలించిన కాకతీయులు, తూర్పు గాంగేయుల శిలాశాసనాలు కనిపిస్తాయి. 1059 సంవత్సరానికి చెందిన తూర్పుగాంగేయుల శాసనాలు శ్రీకాకుళం జిల్లాలో బయటపడ్డాయి. ఇవి దేశంలో మరెక్కడా ఉండవు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పరివాహక ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో క్రీ.శ. 1211 సంవత్సరానికి చెందిన కాకతీయుల శాసనాలు లభ్యమయ్యాయి. వాటిపై అప్పట్లో రాజుల దానాలు, పన్ను వసూలు తదితర వివరాలు లిఖించారు. చాలా శాసనాలను రాగి ప్లేట్లపైన ముద్రించడం విశేషం.
ప్రాచీన నాణేలు..: తెలంగాణలోని కోటిలింగాల వద్ద తవ్వకాల్లో బయల్పడిన శాతవాహనుల కాలం నాటి రాగి, వెండి నాణేలు ఇక్కడ చూడొచ్చు. అసిఫ్‌జాహి, కుతుబ్‌షాహి పాలకులు తయారు చేసిన వెండి నాణేలు ఇక్కడున్నాయి. ఇవి ఒక్కొక్కటి 50 గ్రాములు బరువు ఉండడం విశేషం. విజయనగరం, మైసూర్ రాజులకు చెందిన నాణేలను భద్రపర్చారు.
భాషాభివృద్ధిని తెలిపే ఆధారాలు: అశోకుడి కాలం నుంచి శ్రీకృష్ణదేవరాయుల వరకు భాష ఏవిధంగా మారుతూ వచ్చిందో తెలిపే వివరాలతో పాటు ఏ కాలంలో ఏ చక్రవర్తులు ఎటువంటి లిపిని ఉపయోగించారో తెలిపే ఆధారాలను భద్రపరిచారు. గతంలో ఈ విభాగం ఆధ్వర్యంలోనే చరిత్ర, పురావస్తుశాస్త్ర ఆచార్యుల కృషితో పలు చోట్ల తవ్వకాలు జరిపారు. అక్కడ పురాతన ఆధారాలు బయటపడ్డాయి. ఈ మ్యూజియానికి ఆధునిక హంగులు కల్పించి సందర్శనకు అవకాశం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆదిమానవులు వినియోగించినవి..: ఆదిమానవులు వేటకు వెళ్లేటప్పుడు తీసుకెళ్లిన పదునైన వస్తువులు, ఆహారం తయారీకి వినియోగించిన పాత్రలు, నిప్పు వెలిగించడానికి వాడిన పరికరాలు, వ్యవసాయానికి ఉపయోగించిన సామగ్రి ఉన్నాయి.
హరప్పా, సింధూ నాగరికత కాలంలో మానవులు ఉపయోగించిన మట్టి పాత్రలు, చక్రంతో తయారు చేసిన రంగురంగుల వస్తువులను ఇక్కడ చూడొచ్చు.





