
గాలుల కారణంగా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పెరుమాళ్లపాడు వద్ద ఇసుకతో పెన్నానది గర్భంలో కలిసిపోయిన పురాతన నాగేశ్వరాలయాన్ని దేవాదాయశాఖ తవ్వకాలు జరిపి వెలుగులోకి తెచ్చింది.
మాతృహత్యపాప పరిహారార్థం పరశురాముడి ద్వారా ప్రతిష్ఠించిన శివలింగాన్ని ఇక్కడ నాగేశ్వరస్వామిగా పూజించేవారు. పది శతాబ్దాల క్రితం నాటి రాజులు ఆలయాన్ని నిర్మించారని స్థానికులు చెప్పారు. ఈ ప్రాంతంలో పెన్నానది ఈశాన్య దిశగా మళ్లడంతో నదికి ఎదురుగా ఉన్న గ్రామంపై పడమటి గాలులకు ఇసుక మేటలు వేశాయి. 200 సంవత్సరాల క్రితం గ్రామస్థులు ఆ ప్రాంతాన్ని విడిచి నదీతీరానికి దక్షిణంగా కి.మీ. దూరంలో నూతన గ్రామాన్ని నిర్మించుకున్నారు.
గ్రామస్థుల సంకల్పం
ఆలయానికి వందల ఎకరాల మాన్యాలు ఉండటం, వాటి ద్వారా వచ్చే రాబడి దేవాదాయశాఖ ఖాతాల్లో చేరడంతో గుడిని పునరుద్ధరించాలని స్థానికులు సంకల్పించారు. కరోనా సమయంలో పలు ప్రాంతాల నుంచి ఇళ్లకు వచ్చిన యువత యంత్రాల సాయంతో తవ్వకాలు జరిపి గుడి ప్రాంతాన్ని గుర్తించారు. అనంతరం పర్యాటక, చారిత్రక ప్రదేశంగా మారింది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలతో ఈ ప్రాంతాన్ని రాష్ట్ర దేవాదాయశాఖ స్థపతి పరమేశ్వ జులైలో గుడిని సందర్శించారు. ఆలయాన్ని అదే ఆకృతుల్లో నిర్మించడానికి పర్తిగా వెలికితీసి శిల్పకళ, వాస్తురీతులు నమోదు చేయాలని సూచించారు. రెండు నెలలుగా తవ్వకాలు జరిపి ఆదివారం నాటికి పూర్తిగా వెలికి తీశారు. నాగేశ్వరస్వామి లింగంతో పాటు పార్వతి అమ్మవారి మందిరం, విఘ్నేశ్వర, నందీశ్వర విగ్రహాలు బయల్పడ్డాయి.





