ArticlesNews

సంప్రదాయం కళతో జాతీయ పురస్కారాన్ని అందుకున్నతిరుపతి మహిళా

91views

ఒకప్పుడు ఆ ఊళ్లో మహిళల దినచర్యంతా వ్యవసాయం చుట్టూనే సాగేది. కానీ విజయలక్ష్మి ఆ పరిస్థితిని మార్చారు. కలంకారీ కళను అక్కడివారికి పరిచయం చేశారు. రామాయణ ఘట్టాలను వస్త్రాలపై ఆవిష్కరిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ చిత్రకళా ప్రయాణం ఆమెకు జాతీయ పురస్కారాన్నీ తెచ్చిపెట్టింది.

మాది శ్రీకాళహస్తి. కళాకారుల కుటుంబం. రంగుల పరిమళం, చేతిలో కలం… ఇవే మా లోకం. కలంకారీ కళను చూస్తూ… నాన్న దగ్గర ఓనమాలు నేర్చుకుంటూ పెరిగా. నా తొలి గురువు ఆయనే. పదో తరగతి పూర్తయ్యాక మా చిన్నాన్న మునికృష్ణారెడ్డి నా కళకి మరిన్ని మెరుగులు దిద్దారు. అయితే నాకు స్ఫూర్తి మాత్రం అక్క మునిరత్నమ్మే. దేశంలోనే కలంకారీతో జాతీయ అవార్డు సాధించిన మహిళగా ఆమె పేరు మారుమోగుతోంటే చూసి… అక్క అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నా. పెళ్లయ్యాక వెంకటగిరి మండలంలోని కుప్పంపల్లికి వచ్చా. మారుమూల గ్రామం… నా కళకు ఆదరణ ఉంటుందా? ఇంతటితో ప్రయాణం ఆగిపోతుందేమో అని నాలో ఎన్ని ప్రశ్నలో! కానీ, నాన్న ఎప్పుడూ ‘ఆడపిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడాలమ్మా. అంతేకాదు, నువ్వు నేర్చుకున్న కళ అంతరించిపోకుండా చూసుకోవాలి. దాంతో తోటివారికీ ఉపాధి కల్పించగలగాలి’ అనేవారు. ఆ మాటలే నన్ను ముందుకు నడిపాయి. మావారు, తమ్ముడు కూడా అండగా నిలవడంతో చిన్న కుటీర పరిశ్రమను మొదలుపెట్టాను. నాకంటూ ప్రత్యేకత చాటాలనుకుని వస్త్రంపై కలంకారీతో రామాయణ ఇతివృత్తాల్ని చిత్రించడం మొదలుపెట్టా. సీతమ్మ అరణ్యవాస కష్టాలు, హనుమంతుని భక్తి, రామ పట్టాభిషేకం… ఇలా ప్రధాన ఘట్టాలన్నీ ఆవిష్కరిస్తూ వచ్చా.

మూడేళ్ల శ్రమ..
కానీ.. ఇదంతా ఒకరోజులోనో, నెలలోనో సాధ్యమా? ప్రతి రేఖలో జీవం ఉండాలి. చూసేవారికి త్రేతాయుగం కళ్ల ముందు కదలాలి అనుకున్నా. రోజూ కొంత సమయాన్ని కేటాయిస్తూ చేశా. ఒక ఘట్టం పూర్తయ్యాక దాన్ని సహజ రంగులతో ఉడకబెట్టడం, ఆపై ఆరబెట్టడం. వాతావరణం తేమగా ఉంటే రోజుల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. కొన్నిసార్లు అనుకున్న రంగు రాకపోతే మళ్లీ మొదట్నుంచి మొదలుపెట్టాలి. ఒకవైపు అత్తారింట్లో బాధ్యతలు, మరోవైపు కళ… రెండూ సమన్వయం చేసుకుంటూ వచ్చా. అలా పూర్తి చేయడానికి మూడేళ్లు ఓపికగా శ్రమించా. ఆ కష్టానికి ఫలితంగా రాష్ట్రపతి ప్రశంసలతోపాటు ఆమె చేతులమీదుగా ఇటీవల జాతీయ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిజం చెప్పాలంటే… అవార్డుల కన్నా నా దగ్గర పనిచేసే మహిళల కళ్లలో కనిపించే ఆనందమే నాకు ఎక్కువ సంతోషాన్నిస్తుంది. ఊళ్లో మహిళలు ఒకప్పుడు కలుపు తీయడానికి, ఇతర వ్యవసాయ పనులకు వెళ్లేవాళ్లు. పని ఉంటే సరే! లేదంటే ఖాళీ. అది చూసి బాధేసింది. వాళ్లందరినీ పిలిచి కలంకారీ కళను నేర్పించా. 40 మందికి పైగా నేర్చుకున్నారు. ఇప్పుడు వాళ్లంతా నేర్పుగా చీరలపై చిత్రాలు గీస్తోంటే గర్వంగా అనిపిస్తుంది. వాళ్లు ‘అక్కా.. కూలి పనులకంటే ఇదే గౌరవంగా ఉంది. ఇంటి పట్టునే ఉండి డబ్బులు సంపాదించుకుంటున్నాం’ అని చెబుతోంటే నా జన్మ ధన్యమైంది అనిపిస్తుంది. 30 మంది మహిళలకి జీవనోపాధినీ కల్పిస్తున్నా.

ప్రభుత్వం తోడుంటే..
మారుమూల గ్రామాల్లో ఎన్నో ఇబ్బందుల మధ్య కళల్ని కాపాడుకోవడం శ్రమతో కూడుకున్న పనే! ప్రభుత్వం స్పందించి ఆసక్తి ఉన్నవాళ్లకి వర్క్‌షాప్‌లు నిర్వహించడం, నేర్చుకునేవాళ్లకి స్టైపెండ్‌ ఇవ్వడం లాంటివి చేస్తే అద్భుతాలను సృష్టించవచ్చు. శిక్షణ కేంద్రాలను గ్రామాల్లోకీ తీసుకొస్తే… ఎంతోమంది పల్లె పడతుల జీవితాలు రంగులమయం అవుతాయి. నావరకూ ఈ కలంకారీ కళను కాపాడుతూ, కొందరినైనా ఆర్థికంగా నిలబెట్టడమే లక్ష్యం.