
( జనవరి 26 – గణతంత్ర దినోత్సవం )
ఆర్‌ఎస్‌ఎస్ ప్రారంభం నుండే దేశ ఐక్యత మరియు సమగ్రతను నొక్కి చెప్పింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, దేశం సార్వభౌమ గణతంత్ర దేశంగా మారడాన్ని సూచిస్తూ, ఆర్‌ఎస్‌ఎస్ ఈ అద్భుతమైన విజయాన్ని స్వాగతించింది. దేశవ్యాప్తంగా స్వయంసేవకులు ఈ మహోన్నత సందర్భాన్ని పురస్కరించుకుని కార్యక్రమాలు నిర్వహించారు, వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, దేశభక్తి గీతాలు పాడారు మరియు వందేమాతరం నినాదాలు చేశారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ రాజ్యాంగాన్ని ఎప్పుడూ అంగీకరించలేదని లేదా గౌరవించలేదని పేర్కొంటూ ఆ సంఘాన్ని అప్రతిష్టపాలు చేయడానికి చాలా సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఈ వాదనలు పూర్తిగా నిరాధారమైనవి మరియు అవి స్థిరంగా నిలబడవు.
జనవరి 26, 1950న, మొదటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా, RSS యొక్క రెండవ సర్సంఘ్‌చాలక్, మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ జీ అన్ని రకాల అభిప్రాయాల నుండి వేలాది మంది హాజరైన ఒక బృహత్ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, నేడు, మనమే తయారు చేసుకున్న రాజ్యాంగాన్ని ఆమోదించాము మరియు బ్రిటిష్ కామన్వెల్త్‌తో చివరి లింక్ – బ్రిటిష్ పాలనకు చిహ్నం అయిన కిరీటం – అశోక చక్రం ద్వారా భర్తీ చేయబడింది. మనం ఇప్పుడు నైతికంగా లేదా రాజకీయంగా బ్రిటిష్ వారికి కట్టుబడి లేము మరియు మన మనస్సాక్షి మనకు ఏమి చేయమని చెబుతుందో అది చేయడానికి స్వేచ్ఛగా ఉన్నాము”, అని అన్నారు.
ఇకపోతే మనలో చాలామందికి 26జనవరి అనగానే గణతంత్ర దినోత్సవంగానే తెలుసు. అసలు ఆ రోజే భారత్ గణతంత్రంగా ఎందుకు నిర్ణయించబడింది? అందుకు గల కారణాలేమిటి… 26 జనవరి ప్రాముఖ్యత ఏమిటి..అని అంటే, 1930 జనవరి 26 తేదిని చాలా నిర్ణయాత్మకంగా, భారత రాజకీయాలను మలుపు తిప్పిన దశగా పరిగణిస్తారు. `ఆల్ ఇండియా హోంరూల్ లీగ్’, భారతదేశానికి `డొమినియన్ స్టేటస్’ కావాలని మాత్రమే కోరుకుంది. జిన్నా పార్టీ అయిన `ముస్లిం లీగ్’ కూడా ఇదే అడిగింది. అంటే బ్రిటిష్ సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ, ఆస్ట్రేలియా, కెనడా మొదలైన దేశాలవలె కొంత స్వయంప్రతిపత్తి కలిగి ఉండడం. అయితే జాతీయ నాయకులు లోకమాన్య శ్రీ బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్ మొదలైన వారు పూర్ణస్వరాజ్యం తప్ప ఇంకదేనికీ తలొగ్గేది లేదని తేల్చి చెప్పారు.
`డొమినియన్ లేక పూర్తి స్వాతంత్ర్యం’ వర్గాల మధ్య కాంగ్రెస్‌లో వాదోపవాదాలు జరిగాయి. గాంధీ ఈ రెండు వర్గాల మధ్య సమన్వయం సాధించడం కోసం, ఒక సూత్రం ప్రతిపాదించారు. డిసెంబర్ 1928 కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో, `ఒక సంవత్సరం లోపు బ్రిటిష్ వారు `డొమినియన్’ హోదా ఇస్తే ఇచ్చినట్లు, లేకపోతే `పూర్ణస్వరాజ్య’ సాధన మార్గంలో’ వెళ్ళేటట్లు ప్రతిపాదించారు. దీనిని కాంగ్రెస్ ఆమోదించి తీర్మానించింది. అక్టోబర్ 1929 లండన్ మొదటి `రౌండ్-టేబుల్ సమావేశం’ ఈ విషయం చర్చించలేదు.
బ్రిటిష్ ప్రభుత్వం విముఖత, భారతదేశంలో ఏ రకమైన రాజకీయ రాజ్యాంగ మార్పులను గురించి వారి నిర్లక్ష్యం నేపథ్యంలో, 26 జనవరి 1930 లాహోర్, శీతాకాలం చలిలో, సభ్యుల కరతాళధ్వనుల మధ్య, ఉద్వేగభరితంగా `పూర్ణస్వరాజ్యం’ తీర్మానం, త్రివర్ణ పతాకం ఎగరవేయడం జరిగింది. తొలిసారిగా భారతదేశ స్వాతంత్ర్యం తీర్మానం అధికారికంగా జరిగింది. దీనికి అనుగుణంగా, కాంగ్రెస్ శాసనసభ్యులు అన్ని రాష్ట్ర కేంద్ర చట్టసభల సభ్యత్వం నుంచి రాజీనామా చేసారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ఆ తరువాత కొద్దికాలానికి గాంధీ ఉప్పు సత్యాగ్రహం, దేశవ్యాప్తంగా సహాయనిరాకరణ ముమ్మరంగా సాగాయి.
అప్పటినుంచి ప్రతి సంవత్సరం, కాంగ్రెస్ ఆధ్వర్యంలో `జనవరి 26’ న భారత స్వాతంత్ర్య దినోత్సవం జరిపేవారు. 1947 ఆగస్ట్15 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, పాత `26 జనవరి’ తేదీని మరవకుండా, 1950లో ఆ రోజునే కొత్త `రాజ్యాంగం’ అమలులోకి తెస్తూ, భారతదేశం `గణతంత్రం’గా ప్రభుత్వం ప్రకటించింది.





