
పశ్చిమబెంగాల్‌లో ఆదివారం ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు అక్కాచెల్లెళ్లను అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు తాడుతో కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లి అమానుషంగా వ్యవహరించారు. దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. స్మృతి దాస్ అనే మహిళ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. వారి సొంత భూమిలో ప్రభుత్వ రోడ్డు వేయడానికి పంచాయతీ పెద్దలు సిద్ధమవడంతో ఆమె తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన నాయకులు ఆమె కాళ్లను తాళ్లతో కట్టి మట్టిరోడ్డుపై ఈడ్చుకుంటూ లాక్కెళ్లారు. దీన్ని అడ్డుకున్న ఆమె సోదరిని కూడా అదే తరహాలో ఈడ్చుకెళ్లడం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. ఆ నాయకులంతా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో జిల్లా టీఎంసీ అధ్యక్షుడు దీనిపై స్పందించారు. వెంటనే సదరు నాయకుణ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.





