ArticlesNews

కర్ణాటక సంగీత అఖండ యశస్సు త్యాగరాజస్వామి

164views

త్యాగరాజస్వామి ఆరాధన

ఆపాతమధురం, ఆనందకారకమైంది సంగీతం. అది ఆత్మానుసంధానమై అలరింపజేస్తుంది. అందుకే సంగీతంలో దేవుడు కొలువై ఉంటాడని చెబుతారు. ‘నేనుండేది వైకుంఠంలో, యోగి హృదయంలో, అనంత సూర్య మండలంలో కాదు.. భక్తులు పరవశించి గానం చేసే చోటే నా నివాసం’ అని శ్రీమహావిష్ణువు, నారదుడితో ప్రస్తావించినట్లు విష్ణుపురాణం పేర్కొంది.

దైవదత్తమైన సంగీతకళను ఆరాధించి, ఉపాసించి తమ జీవితాన్ని చరితార్థం చేసుకున్న ఎందరో వాగ్గేయకారులు, సంగీతకళాకారులు ఈ దివ్యధాత్రిని పునీతం చేశారు. భగవదనుగ్రహానికి సంబంధించిన అంశాల్లో నాదోపాసన విశేషమైందని సామవేదం పేర్కొంది. ఇది ఈశ్వరతుల్యమైంది. ధర్మార్థకామ మోక్షాలను సిద్ధింపచేస్తుంది. కర్ణాటక సంగీతానికి త్యాగరాజస్వామి అఖండ యశస్సును ఆపాదించారు. తేటతెలుగులో మధురమైన కీర్తనల్ని సృజించారు. ఆయన రాసి గానం చేసిన కీర్తనలు ఆధ్యాత్మిక చైతన్య తరంగాలై భాసిల్లుతున్నాయి. ఆయన కృతుల్లో వేదసారం, పురాణాల మార్మికత, ఉపనిషత్తుల సారాంశం, భగవద్గీతా ఉపదేశాలు సమ్మిళితమై ఉంటాయి. భక్తి విశేషాలే కాకుండా నీతి సందేశాలను, జీవన జాగృతికి ఉపకరించే మరెన్నో అంశాలను తన రచనల్లో మేళవించారు. సంగీత యోగం ద్వారా దైవసాన్నిధ్యాన్ని సాధించవచ్చని, సాధికారికంగా నిరూపించారు.

96 కోట్లసార్లు పునశ్చరణ
తమిళనాడు తంజావూరు సమీపంలోని తిరువారూర్‌లో 1767 మే 4 వైశాఖ శుద్ధ షష్ఠిన కాకర్ల త్యాగయ్య జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లా కంభం మండలం కాకర్ల గ్రామానికి చెందిన ఆయన పూర్వీకులు తమిళనాడుకు వలస వెళ్లారు. త్యాగయ్య చదువు నిమిత్తం వారి కుటుంబం తిరువారూర్‌ నుంచి తిరవయ్యూరు వెళ్లి స్థిరపడింది. త్యాగయ్య అక్కడ వేదవేదాంగాల్ని, పురాణేతిహాసాల్ని అభ్యసించారు. తన 13వ ఏటనే ‘నమోనమో రాఘవాయ’ అనే కీర్తనను స్వరపరిచారు. ఇహలోకపరమైన విషయాలపై ఆసక్తిలేని త్యాగయ్య సదా రామనామ సంకీర్తన చేసేవారు. పంచనందీశ్వరాలయంలో శ్రీరామ తారక మంత్రాన్ని 96 కోట్లసార్లు పునశ్చరణ చేసి రామసాక్షాత్కారాన్ని పొందారని చెబుతారు. రామసంకీర్తనల్ని ఆలపిస్తూ- ఊంఛవృత్తిలో (పొలాల్లో మిగిలిన ధాన్యాన్ని సేకరించి జీవనం సాగించడం) తనకు దక్కినదానినే ప్రసాదంగా, రామానుగ్రహంగా భావించారు. భక్తి జ్ఞాన మిళితమై, గానయోగ్యంగా, అమృతతుల్యంగా ఉండే త్యాగయ్య కీర్తనలు మనల్ని దైవానికి చేరువ చేస్తాయి.

శొంఠి వెంకటరమణయ్య వద్ద త్యాగయ్య సంగీతాభ్యాసం చేశారు. గురువు అనుగ్రహంతో శ్రీరాముడి మీద అనంత భక్తితో త్యాగయ్య 24 వేల కీర్తనల్ని రచించారని అంచనా. కానీ వాటిలో 8 వేల కీర్తనలు మాత్రమే లభ్యమవుతున్నాయి. నవవిధ భక్తి రీతుల్లో దాస్యం, ఆత్మనివేదనలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. సహజమైన భక్తి, ఆర్తి, విధేయత, విన్నపాలు, వేడుకోళ్లు, రసరమ్యత, పారమార్థిక చింతన వంటి మధుర భావోద్వేగాలు ఆయన కీర్తనల్లో ప్రస్ఫుటమవుతాయి.

సంగీతం ద్వారా అలౌకిక అనుభూతి సాధ్యమవుతుందని త్యాగయ్య తన కీర్తనల ద్వారా నిరూపించారు. సంగీతకళ అనేది కేవలం సప్తస్వర విన్యాసానికే గాక ఆ కళద్వారా ఇహలోక, పరలోక ప్రయోజనాల్ని సాధించాలని త్యాగరాజ స్వామి ప్రతిపాదించారు. రాముడి మీద తన అపార భక్తిని పలురీతుల్లో, వివిధ కోణాల్లో అమోఘంగా వ్యక్తపరిచారు. ‘నీ దయ రాదా కాదనె వారెవరూ కల్యాణ రామా..’, ‘గ్రహబలమేమి శ్రీరామానుగ్రహబలమే..’, ‘నిధి చాల సుఖమా.. రాముని సన్నిధిసేవ సుఖమా..’ ఇలా శ్రీరామసంకీర్తనా స్రవంతిని సరళసుందరంగా, తన్మయపూరితంగా వెలువరించారు త్యాగరాజస్వామి.

ఒక కీర్తన.. 108 నామాలు
త్యాగరాజ పంచరత్న కృతులు పరమపావనకరమైనవిగా సంగీతజ్ఞులు పరిగణిస్తారు. ఘనరాగ పంచరత్న కీర్తనలుగా వ్యవహరించే ఈ కృతుల్ని త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల్లో సంగీతకళాకారులు పారవశ్యంగా ఆలపిస్తారు. ఈ కీర్తనా స్రవంతి సమ్మోహనమై హృదయాలను ఆకట్టుకుంటుంది, మనల్ని దైవసన్నిధిలోకి తీసుకెళ్తుంది. ‘జగదానందకారకా..’ అనే తొలి పంచరత్న కీర్తన 108 శ్రీరాముడి నామాలను వెల్లడిస్తుంది. ఇది ఆయన రామభక్తి వైభవాన్ని, పరిపూర్ణంగా ప్రకటిస్తుంది. ‘దుడుకు గల నన్నే’, ‘నగుమోము గనలేని..’, ‘కనకన రుచిరా..’, ‘ఎందరో మహానుభావులు.. అందరికీ వందనములు..’ వంటి కీర్తనలు భక్తి ప్రపంచంలో మణిమకుటాలై ప్రకాశిస్తున్నాయి.

లౌకికం, పారమార్థికం, ప్రాపంచికం, తాత్వికం, ఉపదేశం, ఉత్సవ సంప్రదాయం, ప్రబోధకం వంటి అంశాలుగా త్యాగయ్య కీర్తనల్ని వర్గీకరిస్తారు. వాగ్గేయకారుడిగా, పరమభక్తాగ్రేసరుడిగా, నాదం ద్వారా యోగాన్ని సాధించిన నాదయోగిగా త్యాగయ్య కీర్తి గడించారు. సంగీతం వేదాంతసారమని నిర్వచించి తన జీవితాన్ని నాదోపాసనకే అంకితంచేసిన మహానుభావుడాయన.
పుష్య బహుళ పంచమి నాడు సద్గురు త్యాగరాజస్వామి శివైక్యం చెందారు. ఆయన సృజించిన కీర్తనలు సూర్యచంద్రులు ఉన్నంతవరకూ నిలిచి ఉంటాయి.