
130views
ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం వద్దకు విశ్వ హిందూ పరిషత్ -VHP, బజరంగ్ దళ్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బారికేడ్లు తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
అప్రమత్తమైన పోలీసు బలగాలు వీహెచ్‌పీ కార్యకర్తలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నిరసనలతో ఆ ప్రాంతంలో పోలీసులు, పారామిలిటరీ బలగాలను మోహరించారు. ఇటీవల బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఆందోళనల సందర్భంగా ఇస్లామ్ మతానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో 25 ఏళ్ల దీపూ చంద్రదాస్ అనే హిందూ యువకుడిని ఆందోళనకారులు తీవ్రంగా కొట్టి చంపారు. ఈ హత్యపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.





