
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న ఘోరమైన హింసా కాండపై విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా మండిపడింది. హిందూ యువకులను, హిందూ ప్రజలను టార్గెట్ గా చేసుకొని, ఛాందసులు రెచ్చిపోవడం ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని, ఈ హింసను తాము ఖండిస్తున్నామని VHP అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ ప్రకటించారు.
హిందూ యువకుడు దీపు చంద్రదాస్ దారుణ హత్యనుఅలోక్ కుమార్ తీవ్రంగా ఖండించారు. పొరుగు దేశంలో మైనారిటీల పరిస్థితి మరీ మరీ దిగజారుతోందని, ఇది తమకు చాలా బాధ, చిరాకు కలిగిస్తోందన్నారు.ఇక.. బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసపై అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలోని ప్రతి జిల్లాలో బంగ్లాదేశ్‌లోని హిందువులపై జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్త ఉద్యమం చేపడతామని ప్రకటించారు.
దైవ దూషణ అన్న ఆరోపణలతో దీపు చంద్రదాస్ హత్య జరిగిందని అన్నారు. తమకు అందిన నివేదిక ప్రకారం ‘‘దీపు చంద్ర దాస్ “అన్ని దేవుళ్లు ఒకటే, వారి పేర్లు మాత్రమే భిన్నంగా ఉంటాయి” అని అన్నారని వెల్లడించారు. దీనిని దైవదూషణగా ముద్ర వేసి, దాని ఫలితంగా ఆయనను సజీవ దహనం చేశారని, ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు.
లౌకికవాదులమని చెప్పుకునే శక్తులు, అంతర్జాతీయ మీడియాలోని కొన్ని వర్గాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల వేదికలు ఈ అంశంపై ఎందుకు పూర్తిగా మౌనంగా ఉన్నాయని అలోక్ కుమార్ నిలదీశారు. దీనిపై బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ కూడా స్పందించారని, దైవ దూషణ అంటూ దీపు చంద్రదాస్ పై ఆరోపణలను ఆపాదించారని గుర్తు చేశారు.
బంగ్లాదేశ్‌లో చట్టబద్ధ పాలన పూర్తిగా పతనమైందని, ఇంత జరుగుతున్నా… అక్కడి ప్రభుత్వం మాత్రం తన బాధ్యతల నుంచి తప్పించుకుందని మండిపడ్డారు.బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం చట్టవిరుద్ధమైన పాలన సాగుతోందని, భయానక వాతావరణం నెలకొందన్నరు. ఈ ఘటన ద్వారా బంగ్లాదేశ్‌లో మైనారిటీలు తీవ్రమైన అభద్రతలో వున్నారని, ఓ క్రమబద్ధకరమైన హింస అక్కడ జరుగుతోందన్నారు. ఇది ప్రపంచం మొత్తానికి ఆందోళన కలిగిస్తోందన్నారు.
కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగాలి : అలోక్ కుమార్
బంగ్లాదేశ్ లో హిందువులు, ఇతర మైనారిటీల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా వుందని అలోక్ కుమార్ అన్నారు. అక్కడి వారి పరిస్థితులను అంచనా వేయడానికి, వారికి భద్రత కలిపించే విషయంలో సాధ్యమైనంత వేగంగా దౌత్య, రాజకీయ, మానవతా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ముహమ్మద్ యూనస్‌కు ఇచ్చిన నోబెల్ శాంతి బహుమతిని వెంటనే రద్దు చేయాలని అలోక్ కుమార్ డిమాండ్ చేశారు.
భారతదేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్ మరియు తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను చిత్రీకరించిన మ్యాప్‌ను బహిరంగంగా సవాలు చేస్తూ, ఫేస్‌బుక్‌లో “గ్రేటర్ బంగ్లాదేశ్” మ్యాప్‌ను షేర్ చేసిన షరీఫ్ ఉస్మాన్ హాదికి ముహమ్మద్ యూనస్ పూర్తి గౌరవాలతో ప్రభుత్వ అంత్యక్రియలు నిర్వహించడాన్ని కూడా ఆయన తీవ్రంగా ఖండించారు.




