
పొరుగుదేశం బంగ్లాదేశ్‌ను ఉద్దేశించి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాతో దౌత్యానికి సమయం దాటిపోయిందని, ఇక శస్త్రచికిత్స అవసరమన్నారు. జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
‘‘వ్యూహాత్మకంగా కీలకమైన చికెన్స్ నెక్ గురించే ఆందోళన అంతా. దౌత్యం, ఇతరమార్గాల ద్వారా 20-22 కి.మీ భూభాగాన్ని భారత్ కాపాడుకోవాల్సి ఉంది. ఔషధాలు విఫలమైనప్పుడు, శస్త్రచికిత్స అవసరం’’ అని హిమంత వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్న తరుణంలో ఈవిధంగా స్పందించారు. బంగ్లా తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ గతంలో చైనా పర్యటన సందర్భంగా ఈ చికెన్స్ నెక్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత ఈశాన్య ప్రాంతంలోని ఏడు రాష్ట్రాలను సెవెన్ సిస్టర్స్ అంటారు. అవి బంగ్లాదేశ్‌తో భూపరివేష్టితమై ఉన్నాయి. వారు సముద్రానికి చేరుకోవడానికి వేరే మార్గం లేదు. ఈ ప్రాంతంలో సముద్రానికి మేమే రక్షకులం. కాబట్టి ఇది భారీ అవకాశం. చైనా ఆర్థిక బేస్‌ను విస్తరించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది’’ అని నోరు పారేసుకున్నారు.
చికెన్స్ నెక్ కారిడార్.. పశ్చిమబెంగాల్‌లోని సిలిగురి భూభాగంలో ఇది ఉంటుంది. ‘7 సిస్టర్స్’గా పిలిచే 7 ఈశాన్య రాష్ట్రాల (అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపుర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర)ను భారత ప్రధాన భూభాగంతో ఈ కారిడార్ కలుపుతోంది. ఈ ప్రాంతంలో కొంతభాగం కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉంది. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లకు అతి దగ్గర్లో ఉంది. చైనా అధీనంలోని చుంబీలోయ దీనికి అత్యంత సమీపంలో ఉంది.
ఈ ప్రదేశంపై దాడి చేసి భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేసే ప్రమాదం ఉందని సైనిక వ్యూహకర్తలు కొన్ని దశాబ్దాలుగా ఆందోళన చెందుతున్నారు. ఇదే జరిగితే ఈశాన్య ప్రాంతాల్లోని సైనిక దళాలకు సరఫరాలు కష్టమైపోతాయి. డోక్లాం ట్రై జంక్షన్ వద్ద చైనా రోడ్డు నిర్మాణాలను భారత్ దళాలు అడ్డుకోవడానికి గల ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. డోక్లాం ప్రాంతం తమదేనంటూ డ్రాగన్ వాదిస్తూ వస్తోంది. ఈ విషయమై 2017లో భారత్-చైనాల మధ్య 72 రోజుల పాటు ప్రతిష్టంభన నెలకొంది.





