
అందరి కష్టాలు గట్టెక్కించే దేవుడి ఆలయాలు జీర్ణావస్తకుచేరాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 30 వేలకుపైగా దేవాలయాలు శిథిలావస్థకు చేరాయి. ప్రముఖ దేవాలయాలు ఆదాయంలోనూ, భక్తుల సందర్శనలోనూ దూసుకెళుతుంటే వేల సంవత్సరాలు చరిత్ర కలిగిన వేలాది దేవాలయాలు దూపదీప నైవేధ్యాలకు నోచుకోవడం లేదు. భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి నూతన దేవాలయాల నిర్మాణంతోపాటు, పురాతన ఆలయాల స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నారు. అయితే దేవాదాయ శాఖ నుంచి తగిన ప్రోత్సాహం లేకపోవడం ప్రధాన అవరోధంగా మారింది.
దేవాలయాల పునర్నిమాణం, ఆలయాల పునరుద్దరణ చాలా ఖర్చుతో కూడుకున్న అయినా, లక్షలాది భక్తులు శక్తిమేర ఆలయాల నిర్మాణాలకు విరాళాలు అందిస్తున్నారు. పదేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పదివేలకు పైగా కొత్త ఆలయాలు నిర్మించారు. ఇంకా 20 వేల ఆలయాలు శిధిలావస్థలోనే ఉన్నాయి. వాటి పునరుద్దరణ, లేదా పునర్నిమాణానికి 10 వేల కోట్ల నిధులు అవసరం అవుతాయి. అయితే దేవాలయాల నుంచి వస్తున్న ఆదాయంపై శ్రద్ధ పెడుతున్న ప్రభుత్వం ఆలయాల పునరుద్దరణలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో చరిత్ర, ప్రాశస్త్యం కలిగిన ఆలయాలు నేడు కళా విహీనంగా మారుతున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం చొరవ అభినందనీయం
దేవాలయాల పునరుద్దరణ, నూతన ఆలయాలకు ఆర్థిక సాయం అందించడంలో తిరుమల తిరుపతి దేవస్థానం చెప్పుకో దగిన చొరవ చూపుతోంది. రాష్ట్రంలోని వేలాది దేవాలయాలు నిర్మించడానికి, వాటి పునరుద్దరణకు తితిదే ఇతోధికంగా సాయం అందిస్తోంది. తాజాగా 5 వేల దేవాలయాలు నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. ఇక ఆలయాల్లో భజన మండపాలకు ఒక్కో దానికి 20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. తిరుమల దేవస్థానం బోర్డు శక్తి మేరకు దేవాలయాలకు సాయం చేస్తోంది. తాజాగా తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.35 కోట్లు కేటాయించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏర్పాటు చేశారు. మంత్రులను నియమిస్తున్నారు. వారు ప్రధానఆలయాలపై శ్రద్ధ చూపుతున్నా, శిథిలావస్థకు చేరిన దేవాలయాలపై మాత్రం పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. దీంతో భక్తులు పెద్దగా రాని, ఆదాయం అలలేలేని దేవుళ్లను, దేవాలయాను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రముఖ దేవాలయాల బోర్డులు పరిపాలన చూస్తున్నాయి. వేలాది మంది భక్తులు తిరుమల, యాదగిరి గుట్ట, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం లాంటి దేవాలయాలను సందర్శిస్తూ ఉంటారు. ఆ దేవాలయాల ఆదాయం కూడా కోట్లలో ఉంటుంది. 24 గంటలు పర్యవేక్షణ ఉంటుంది. ప్రముఖ దేవాలయాలు వర్ధిల్లుతున్నాయి. కానీ వేల సంవత్సరాల చరిత్ర కలిగిన వేలాది దేవాలయాలు కునారిల్లుతున్నాయి.
దేవాలయాల పునరుద్దరణకు ప్రభుత్వం శ్రద్ధ చూపాలి. తిరుమల దేవస్థానం తరహాలు ఇతర ప్రముఖ దేవాలయాలకు వస్తున్న ఆదాయం ద్వారా చరిత్ర కలిగిన వేలాది దేవాలయాల పునర్నిమాణం చేపట్టాలి. పూజారులను నియమించాలి. భక్తులకు సౌకర్యాలు కల్పించాలి. తద్వారా చరిత్రను కాపాడుకోవడంతో పాటు హిందూ మతం విరాజిల్లుతుంది. ప్రముఖ దేవాలయాలతోపాటు, మారుమూల ప్రాంతాల్లోని దేవాలయాలు కూడా ఆధ్యాత్మిక వెలుగులు నింపుతాయి.





