
తిరుపతి నగరంలోని జాతీయ సంస్కృతం విశ్వవిద్యాలయంలో భారతీయ విజ్ఞానసమ్మేళనం డిసెంబర్ 26 నుండి 29 వరకు నాలుగు రోజుల పాటు దేశంలోని అనేక రాష్ట్రాలనుండి వచ్చే1500 మంది ప్రతినిధులతో జరగనుంది. ఈ సమ్మేళనంలో శాస్త్రసాంకేతిక రంగాలలోని నూతన ఆవిష్కరణలు, భారతీయ విజ్ఞానవైభవం గురించి పరిశోధనాత్మకమైన మరియు ఆలోచనాత్మకమైన అనేక చర్చాసదస్సులు జరుగనున్నాయి.26 వ తేదీన జరగనున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనం ప్రారంభసమావేశానికి ముఖ్య అతిథి మరియు ప్రధానవక్తగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్‌చాలక్ పూజనీయ మోహన్ భగవత్ గారు విచ్చేయనున్నారు. అలాగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి డా. జితేంద్ర సింగ్ రానున్నారు. సిఎస్ఐఆర్ పూర్వ డైరక్టర్ జనరల్ డా. శేఖర్ మాండే, డిఆర్‌డిఓ పూర్వ ఛైర్మన్ డా. సతీశ్ రెడ్డి, ఎన్‌ఐఎఫ్ డైరక్టర్ అరవింద్ రాణాడే,అమెరికాలోని పర్డ్యూ యూనివర్శిటీ ఆచార్యులు ప్రొఫెసర్ అలోక్ చతుర్వేదీ మరియు పలు ఐఐటి, కేంద్ర పరిశోధన సంస్థల డైరక్టర్లు, విశ్వవిద్యాలయాల ఉపకులపతులు పాల్గొని వివిధ అంశాలపై ప్రసంగిస్తారు.
29వ తేదీన జరగనున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనం ముగింపు సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి సభ్యురాలు డా. శామిక రవి, కేంద్ర శాస్త్ర సాంకేతిక మండలి కార్యదర్శి అభయ్ కరండికర్ రానున్నారు.
శాస్త్ర, సాంకేతిక రంగాలలో నూతన ఆవిష్కరణలకి సంబంధించి డిఆర్‌డిఓ, సియస్‌ఐఆర్, ఎన్‌ఐఎఫ్, ఎంపిసిఎస్‌టి, ఎన్‌ఆర్‌ఎస్‌సి, పిఎఫ్‌సి వంటి ప్రతిష్ఠాత్మక శాస్త్ర పరిశోధన సంస్థలు భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో భాగంగా ఏర్పాటు చేసే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్‌పోలో పాల్గొననున్నాయి.





