
వాయు, జల, శబ్ద కాలుష్యాలు అందరికీ తెలిసినవే. ఇవి కంటికి కనిపించే బాహ్య కాలుష్యాలు. వీటి నివారణ, ప్రక్షాళనల కోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తుంటాయి. ఎప్పటికప్పుడు ప్రజలలో చైతన్యం తీసుకొస్తుంటాయి. వీటన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైనది ఒకటుంది. అదే భావ కాలుష్యం. ఇది నానాటికి మనుషుల మనసుల్లో పేరుకుపోతోంది. భావ కాలుష్యం అంటే ఏంటంటే… మంచిగా ఉన్న వ్యక్తులను ఇతరులు చెడుగా మార్చేయడమే.
మనం ఏం చేయాలన్నదాన్ని ఆలోచనలు నిర్ణయిస్తాయి. మనం ఎలా ఆలోచించాలో మన భావాలు ప్రభావితం చేస్తాయి. కానీ నేటి ఆధునిక యుగంలో మన భావాల్ని మన చుట్టూ ఉన్న పరిసరాలు, వ్యక్తులు, స్నేహితులు, చదువు, ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలు, రాజకీయ పక్షాలు వంటివి నిర్ణయిస్తున్నాయి. మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా మన చర్యల్ని నియంత్రిస్తున్నాయి. మన విచక్షణతో పనిలేకుండా అభిప్రాయాలను ఏర్పరుస్తున్నాయి. వాటిలో సహేతుకం కానివి ఎన్నో ఉంటున్నాయి. కనిపించే బాహ్య కాలుష్యం కన్నా కంటికి కనిపించని భావ కశ్మలం చాలా హానికరమైంది. క్షణక్షణానికి మనుషుల మనసుల్లో పెరిగిపోతున్న దీనికి విరుగుడు ఎవరికి వారే స్వచ్ఛందంగా ప్రక్షాళన చేసుకోవడమే. మనిషి భావ కాలుష్యానికి బానిసగా మారకపోతే ఆరోగ్యరీత్యా హాని కలిగించే ఎన్ని బాహ్య కాలుష్యాలనైనా నివారించవచ్చు. లేకపోతే లోపల, బయట అంతటా ప్రమాదమే.
మనుషులందరూ ధర్మబద్ధంగా నిబద్ధతతో జీవిస్తే భావ కాలుష్యానికి లోనయ్యే ప్రసక్తే ఉండదు. ధర్మంగా జీవించడం అంటే ఇతరులు ఏది చేస్తే తనకు అప్రియంగా ఉంటుందో, ఆ పని తాను ఇతరులకు చేయకపోవడం. అదే పరమధర్మమని మహాభారతం చెబుతోంది. ప్రతి ఒక్కరూ ధర్మాన్ని పాటిస్తే సమాజంలో ఎటువంటి కాలుష్యమూ ఉండదు. మనిషిలోని స్వార్థమూ భావ కాలుష్యానికి దారితీస్తుంది. నేను, నాది, నా సుఖాలే ధ్యేయంగా జీవించాలనే తత్వమే నేడు మనుషుల్లో అధికంగా కనిపిస్తోంది. తోటివారి గురించి, సమాజం గురించి నిర్లక్ష్యపు వైఖరి పెరిగిపోతోంది. భావ కాలుష్యానికి మూల కారణాలు ఇవే. స్వసుఖానికి, స్వలాభానికి అడ్డువస్తే ఆఖరికి కన్నవాళ్లనైనా కడతేర్చే స్వార్థం ప్రబలిపోతోంది. మనుషుల్లోని భావ కాలుష్యం పరాకాష్ఠకు చేరుకుంటోంది. దీని వల్లనే దైవభక్తి సన్నగిల్లుతోంది. అవినీతి, అన్యాయం, అక్రమాలు, నేరాలు- ఘోరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇతరులకు మేలు చేయకపోయినా నష్టం లేదు, కనీసం కీడు చేయకుండా ఉంటే చాలనే స్థాయికి దిగజారింది మానవత్వం. ఇక దైవత్వాన్ని ఎక్కడ వెదుకుతాం?
‘నిస్వార్థమే దైవత్వం. మనిషిగా పుట్టిన ప్రతివారూ నేర్చుకోవాల్సిన తొలి పాఠం ఇదే’ అన్నారు స్వామి వివేకానంద. దేవుడు కేవలం దేవాలయానికే పరిమితమనే భావ కాలుష్యాన్ని వీడి, సర్వజీవుల్లోనూ అంతర్యామిగా కొలువై ఉన్న ఆ పరమాత్మను సందర్శించగలగడమే అసలైన ఆధ్యాత్మికత.





