News

దుర్గమ్మ గుడిలో ‘నో క్యాష్’ – దర్శనం నుంచి ప్రసాదం వరకు అంతా డిజిటల్ మయం

177views

బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నారా? అయితే మీ జేబులో పర్సు ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందో లేదో ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే ఇంద్రకీలాద్రిపై ఇక ‘నగదు’ లావాదేవీలకు కాలం చెల్లింది. అమ్మవారి సన్నిధిలో అంతా ‘డిజిటల్’ మయమే కాబోతోంది. దర్శన టికెట్ మొదలుకొని, లడ్డూ ప్రసాదం వరకు, తలనీలాలు సమర్పించడం నుంచి విరాళాల వరకు ప్రతిదీ ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. ఈ మేరకు ఆలయ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. సాంకేతికతను జోడించి భక్తులకు మరింత పారదర్శకమైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది.

మొత్తం ఆన్‌లైన్ సేవలే: విజయవాడ దుర్గగుడిలో ఇకపై సేవలను పూర్తిగా డిజిటల్ రూపంలోకి మారుస్తున్నారు. క్యూ లైన్లలో నిలబడి, చిల్లర కోసం వెతుక్కునే ఇబ్బంది ఇక ఉండదు. దర్శనం టికెట్లు, ప్రత్యేక పూజలు, ఆర్జిత సేవలు (ప్రత్యక్ష, పరోక్ష) అన్నీ ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలి. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వసతి గదుల కోసం కూడా డిజిటల్ పేమెంట్ చేయాల్సిందే. చివరకు కేశఖండన (తలనీలాలు) టికెట్లు, లడ్డూ ప్రసాదం కౌంటర్ల వద్ద కూడా డిజిటల్ చెల్లింపులే జరగబోతున్నాయి. హుండీ కాకుండా, ఆలయానికి ప్రత్యేకంగా ఇచ్చే విరాళాలను కూడా ఇకపై ఆన్‌లైన్ ద్వారానే స్వీకరిస్తారు.

అక్రమాలకు చెక్, చేతివాటం ఇక చెల్లదు: ఈ డిజిటల్ నిర్ణయం వెనుక ప్రభుత్వం బలమైన లక్ష్యాన్ని పెట్టుకుంది. టికెట్ల విక్రయాల్లో ఇప్పటివరకు జరుగుతున్న చిన్నచిన్న అవకతవకలకు అడ్డుకట్ట వేయడమే దీని ప్రధాన ఉద్దేశం. కౌంటర్ల వద్ద భౌతికంగా టికెట్లు ఇస్తుండటంతో, అక్కడక్కడా సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. లెక్కల్లో తేడాలు రాకుండా, ప్రతి రూపాయి దేవస్థానానికి చేరేలా ఈ ప్లాన్ వేశారు. డిజిటల్ విధానంతో పూర్తి పారదర్శకత వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

ఆలయాలకు ర్యాంకులు: రాష్ట్రంలోని దేవాలయాల్లో డిజిటల్ చెల్లింపులను పెంచాలని ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15 ప్రధాన దేవాలయాలకు ప్రత్యేక లక్ష్యాలను నిర్దేశించింది. ప్రతిరోజూ ఏ ఆలయంలో ఎన్ని ఆన్‌లైన్ లావాదేవీలు జరిగాయనే దానిపై ర్యాంకులు ఇస్తున్నారు. ఈ పోటీలో దేవాలయాలు పోటాపోటీగా పని చేస్తున్నాయి. ఇప్పటికే శ్రీశైలం, కాణిపాకం ఆలయాల్లో ఈ విధానం విజయవంతంగా అమలవుతోంది.

రేసులో శ్రీశైలం ఫస్ట్, బెజవాడ సెకండ్: ప్రభుత్వం తాజాగా బుధవారం విడుదల చేసిన ర్యాంకుల్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అత్యధిక డిజిటల్ లావాదేవీలతో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం రెండో స్థానాన్ని దక్కించుకుంది. బుధవారం ఒక్కరోజే దుర్గగుడిలో ఏకంగా 947 ఆన్‌లైన్ టికెట్లు విక్రయించారు.

వాట్సాప్‌లో హాయ్ చెబితే చాలు: సాంకేతికత తెలియని వారు ఇబ్బంది పడకుండా బుకింగ్ ప్రక్రియను చాలా సులభతరం చేశారు. భక్తులు తమకు నచ్చిన పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఫోన్ పే, గూగుల్ పే వంటి అన్ని రకాల యూపీఐ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేకంగా ‘వాట్సాప్’ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం కల్పించారు. ‘మనమిత్ర’ పేరుతో వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చారు.

టికెట్లు బుక్ చేసుకోవడం ఎలా?: భక్తులు ఇంటి వద్ద నుంచే ఈ కింది మార్గాల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఆలయ ఈవో శీనానాయక్ సూచించారు.

వెబ్‌సైట్లు: www.kanakadurgamma.org లేదా www.aptemples.ap.gov.in

మొబైల్ యాప్: కనకదుర్గమ్మ ఆలయ అధికారిక యాప్ ద్వారా

వాట్సాప్ సేవ: 9552300009 నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా