
‘భారతీయులు ఎక్కడికి వెళ్లినా వైవిధ్యాన్ని గౌరవిస్తారు. ఆ వైవిధ్యమే భారతీయ సంస్కృతికి బలమైన పునాది’ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. గత 11 ఏళ్లలో భారత్ తన ఆర్థిక డీఎన్‌ఏను మార్చుకుందని అన్నారు. ఈ మార్పు వల్లే ప్రపంచంలోని అత్యంత పోటీతత్వ మార్కెట్లలో ఒకటిగా భారత్ ఎదిగిందన్నారు. ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్యాన్ని పెంచేందుకు భారత్ కుదుర్చుకుంటున్న ‘సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాలు’ (సీఈపీఏ) భాగస్వామ్య దేశాల్లో కొత్త విశ్వాసాన్ని నింపాయని పేర్కొన్నారు. గురువారం ఒమన్ రాజధాని మస్కట్‌లో నిర్వహించిన ‘భారత్ – ఒమన్ బిజినెస్ ఫోరం’ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. గత 11 ఏళ్లలో భారత ప్రభుత్వం చేసిన ఆర్థిక, వాణిజ్య సంస్కరణలను, వాటి వల్ల సాధించిన ఫలితాలను సభికులకు ఆయన వివరించారు.
‘మార్కెట్ ఏకీకరణ చేశాం- ఆర్థిక క్రమశిక్షణ పెంచాం’
‘ఈ సదస్సు భారత్-ఒమన్ భాగస్వామ్యానికి కొత్త దిశను, వేగాన్ని అందిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఇరుదేశాల భాగస్వామ్యం కొత్త ఎత్తులను అందుకుంటుందని ఆశిస్తున్నాను. గత 11 ఏళ్లలో భారత్ కేవలం విధానాలనే మార్చుకోలేదు. తన ఆర్థిక డీఎన్‌ఏను కూడా మార్చుకుంది. దివాలా – బ్యాంక్ రప్ట్సీ కోడ్(ఐబీసీ), జీఎస్‌టీ వంటి విప్లవాత్మక చొరవల ద్వారా భారత్ వికాసం దిశగా అడుగులు వేసింది. జీఎస్‌టీ వ్యవస్థ వల్ల యావత్ భారత్‌లోని మార్కెట్ ఏకీకరణ జరిగింది. దివాలా – బ్యాంక్ రప్ట్సీ కోడ్ వల్ల సంస్థలకు ఆర్థిక క్రమశిక్షణ పెరిగింది. దీనివల్ల వాటి వ్యాపార కార్యకలాపాల్లో పారదర్శకత మెరుగుపడింది. దీనివల్ల భారత మార్కెట్‌పై పెట్టుబడిదారులకు విశ్వాసం పెరిగింది’ అని ప్రధాని మోదీ తెలిపారు
సీఈపీఏ మన భవిష్యత్తుకు బ్లూ ప్రింట్ : ప్రధాని మోదీ
‘ప్రపంచ నాగరికత మొదలైన నాటి నుంచే మన పూర్వీకులు సముద్ర మార్గంలో వాణిజ్యం చేయడం మొదలుపెట్టారు. గుజరాత్‌లోని మండావి, ఒమన్‌లోని మస్కట్‌లను అనుసంధానించే బలమైన వారధిగా అరేబియా సముద్రం మారింది. అదే మన రెండు దేశాల బంధాన్ని బలోపేతం చేసింది. మనకు శక్తిని, సంస్కృతిని, ఆర్థికాన్ని ప్రసాదించింది. సముద్ర తరంగాలు మారుతాయి. రుతువులు మారుతాయి. అయితే భారత్ – ఒమన్ స్నేహబంధం ప్రతి సీజన్‌లోనూ మరింత బలపడుతుంది. అది కొత్త ఎత్తులను తాకుతుంది. ఇరుదేశాల దౌత్య సంబంధాలు మొదలై నేటికి 70 ఏళ్లు. ఇది వేడుక సమయం కాదు. మన ప్రాచీన అనుబంధాన్ని ఈ కీలకమైన మైలురాయి నుంచి మరింత ముందుకు తీసుకెళ్లాలి. భవిష్యత్తులోనూ గుర్తుండిపోయే కీలకమైన నిర్ణయాలను ఇప్పుడు మనం తీసుకోబోతున్నాం. భారత్ – ఒమన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంచుతుంది. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇరుదేశాల్లోని అన్ని రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను చూపుతుంది. మన భవిష్యత్తుకు ఇది బ్లూ ప్రింట్‌లా పనిచేస్తుంది’ అని ప్రధాని మోదీ చెప్పారు.
భారత్ ఎదిగితే ఒమన్‌కూ ప్రయోజనమే
‘భారత్ ఎదిగే క్రమంలో తన మిత్రదేశాల వికాసానికీ చేయూతను అందిస్తుంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ పురోగమిస్తోంది. ఈ మార్పు ఒమన్‌కు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే అది భారత్‌కు ఆప్తమైన మిత్రదేశం. సముద్ర జలాల పరంగా మనవి ఇరుగుపొరుగు దేశాలు. భారత్ ఆర్థిక వికాసంలో భాగం అయ్యేందుకు ఒమన్ వ్యాపారులు, కంపెనీలు ముందుకు రావాలి’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
దీపావళికి యునెస్కో ట్యాగ్‌పై మోదీ హర్షం
ఒమన్‌లోని ప్రవాస భారతీయులతో మస్కట్ నగరంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలోనూ ప్రధాని మోదీ ప్రసంగించారు. దీపావళి పండుగకు యునెస్కో ‘సాంస్కృతిక వారసత్వ’ ట్యాగ్ లభించడంపై ఆయన హర్షం వెలిబుచ్చారు. ఇప్పుడు భారతీయ దివ్వెలు కేవలం భారతీయుల ఇళ్లనే కాకుండా, యావత్ ప్రపంచానికి వెలుగులను పంచుతాయని మోదీ వ్యాఖ్యానించారు.
కీలక ఒప్పందాలివీ
వ్యూహాత్మక సహకారానికి సంబంధించిన సంయుక్త విజన్ డాక్యుమెంట్‌పై భారత్ – ఒమన్ సంతకాలు చేశాయి.
వ్యవసాయరంగ ఆవిష్కరణలు, ఆహార పరిశ్రమల విభాగంలో పరస్పర సహకారానికి సంబంధించిన ఒప్పందాన్ని కూడా ఇరుదేశాలు కుదుర్చుకున్నాయి.
సముద్ర మార్గ వారసత్వం, మ్యూజియంలు, శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు, నైపుణ్య వికాసం, వాణిజ్య సహకారం, వ్యవసాయ విభాగాల్లో ఒమన్‌కు చెందిన ఛాంబర్ ఆఫ్ కామర్స్, భారత్‌కు చెందిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నాలుగు అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.





