News

అశాంతికి, అలసటకు ధ్యానమే విరుగుడు

140views

ప్రపంచంలో అశాంతి తాండవిస్తున్న ప్రస్తుత తరుణంలో ధ్యానం వంటి శాశ్వత శాంతి సాధనాలను స్వీకరించాల్సిన అవసరాన్ని మానవాళి గుర్తించాలని ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్‌ పేర్కొన్నారు. జెనీవాలో ఐక్యరాజ్యసమితి భవనంలో రెండో ప్రపంచ ధ్యాన దినోత్సవానికి ముందు బుధవారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ధ్యానం వ్యక్తిగత శ్రేయస్సుకే కాకుండా, అలసట, ఒత్తిడి, అనిశ్చితి, భావోద్వేగ సంఘర్షణల్లో కొట్టుమిట్టాడుతున్న సమాజాల్లో స్థిమితాన్ని, శాంతిని సాధించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

ప్రపంచ శాంతి కోసం ధ్యానం
జెనీవాలోని భారత శాశ్వత కార్యాలయం(పర్మనెంట్‌ మిషన్‌ ఆఫ్‌ ఇండియా), ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ‘ప్రపంచ శాంతి కోసం ప్రపంచం ధ్యానం చేస్తోంది’ అనే అంశంపై గురుదేవ్‌ ప్రసంగించారు. లింగ, వయో భేదాలకు అతీతంగా అందరిలో ఆందోళన, తీవ్ర అలసట, ఒంటరితనం పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో సమస్యలను కేవలం బాహ్య పరిష్కారాలతోనే నిర్మూలించలేమని, మనిషి మనసును స్థిరపరచడం ఎంతో ముఖ్యమని ఆయన స్పష్టంచేశారు. ధ్యానం విలాసం కాదని, అది అవసరమని గురుదేవ్‌ అన్నారు. మన జనాభాలో మూడో వంతు మంది ఒంటరితనంతో బాధపడుతున్నారు. సగం మంది మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో మనల్ని అంతరంగంతో ముడివేసే, మనలో దాగి ఉన్న ఒత్తిడిని తొలగించే సాధన అవసరం, ఆ సాధనే ధ్యానం, అని ఆయన చెప్పారు.

ధ్యానం… అప్రమత్త మానసిక స్థితి
‘‘మైండ్‌ఫుల్‌నెస్‌ లేదా అప్రమత్త మానసిక స్థితి మీ ఇంటికి వెళ్లే దారి లాంటిది, ధ్యానం మీ ఇల్లు. ధ్యానం మనల్ని మన అంతరంగ లోకంలోకి తీసుకెళ్లి ప్రశాంతతను అందిస్తుంది. ఇది సాధించడం కష్టం కాదు. ధ్యానం చేయడం అంటే మనసు అనే కంప్యూటర్‌లో అనవసరంగా పేరుకుపోయిన ఫైళ్లన్నింటినీ ‘డిలీట్‌’’ చేయడమే అని గురుదేవ్‌ అన్నారు. గత ఏడాది డిసెంబర్‌ 21న ‘వరల్డ్‌ మెడిటేట్స్‌ విత్‌ గురుదేవ్‌’ కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా 85 లక్షల మందికి పైగా ప్రజలు ఒకచోట చేరి ధ్యానం చేశారు. ఇది ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద ధ్యాన సమూహంగా ఆరు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులను సృష్టించింది. ఈ నెల 21న ప్రపంచ ధ్యాన దినోత్సవ సందర్భంగా న్యూయార్క్‌ నగరం వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లోని ప్రతిష్టాత్మక ‘ఒక్యులస్‌’ కేంద్రంగా భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు శ్రీశ్రీ రవిశంకర్‌ నేతృత్వంలో కోట్లాది మంది ధ్యానం చేయనున్నారు.