
శివుడు, విష్ణువు వేరుగా కనిపించినా.. ఒకే పరబ్రహ్మస్వరూపం. ఈ శివకేశవ అభేదాన్ని అవతారరూపంలో చూపించేది అయ్యప్ప స్వరూపం. అద్వైతానుభూతికి ఆచరణ రూపమే హరిహరసుత అయ్యప్ప అవతారం.
పరమేశ్వరుడు మహాశక్తి స్వరూపుడు. ఆయన అనేకమై జగత్తును నడిపిస్తున్నాడు. ఆ యోగమాయే పురుషరూపంలో నారాయణుడు. స్త్రీ రూపంలో జగదాంబ. ఆ అమ్మ క్రోధంలో కాళి, సమరంలో దుర్గ, భోగభాగ్యాల్లో భవాని, క్షీరసాగర మథనం వేళ అమృతాన్ని అర్హులకు పంచడంలో నారాయణి, అనర్హులకు అందకుండా చేయడంలో మోహిని అయ్యింది. పరమశివుడు లోకరక్షణకై మోహినికి ఆకర్షితుడై మహిషి అనే రాక్షసిని (మహిషాసురుడి సోదరి) సంహరించేందుకు- శక్తిని సృష్టించాడు. ధనుర్మాసం ఉత్తరా నక్షత్రంలో అవతరించిన ఆ శక్తి స్వరూపమే అయ్యప్ప.
పౌరాణిక కథనాలను అనుసరించి కైలాసంలో గణపతి, సుబ్రహ్మణ్య స్థానాలతో పాటు మహాశాస్త (జ్ఞానాన్ని, ముక్తిని ప్రసాదించే దైవం) స్థానం కూడా ఉంది. హరిహర సంయోగంతో అవతరించిన శిశువును దేవతలు పంపానదీ తీరంలో వదిలేశారు. ఆ సమయంలో పందళ దేశాధీశుడైన రాజశేఖరుడు వేటకు వచ్చాడు. సంతానం లేని అతడు ఆ బిడ్డను ఈశ్వర ప్రసాదంగా భావించి రాజభవనానికి తీసుకెళ్లాడు. కంఠంలో మణిమాల ఉండటాన మణికంఠుడిగా పిలుచుకున్నారు. ఆ బాలుడు వచ్చిన వేళావిశేషంతో రాణికి సంతానం కూడా కలిగింది.
పులిపాలు.. మహిషి సంహారం
మహావీరుడైన మణికంఠ చిన్నతనంలోనే తన పరాక్రమంతో రాజ్యాన్ని శత్రువుల బారి నుంచి రక్షించాడు. భవిష్యత్తులో తన సొంత కుమారుడికి మణికంఠుడు అడ్డుగా ఉంటాడేమోనని భయపడింది రాణి. తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు నటించి అది తగ్గడానికి పులిపాలు కావాలని రాజును ఒత్తిడి చేసింది. పులిపాలు తెచ్చేందుకు బయల్దేరిన మణికంఠ మార్గమధ్యంలో మహిషిని సంహరించి, పూర్వజన్మ శాపాన్ని తొలగించి ఆమెకి దైవత్వాన్ని ప్రసాదించాడు. తర్వాత తల్లి ఆజ్ఞానుసారం పులిపాలే కాదు, ఏకంగా పులిపై స్వారీచేసి రాజ్యానికి తిరిగొచ్చాడు.
ఈ సంఘటనలను గమనించినప్పుడు- అయ్యప్ప అవతార మూలతత్వం కనిపిస్తుంది. మహిషిని సంహరించడం తమోగుణ నిర్మూలనం. పులిని అధిరోహించడం రజోగుణ నియంత్రణం. తల్లికి స్వచ్ఛమైన క్షీరాన్ని సమర్పించడం సత్వగుణానికి ప్రతీక. రాజు ఇవ్వజూపిన రాజ్యాన్ని తిరస్కరించి సత్వ రజస్తమో గుణాలకు అతీతమైన స్థితిని చేరుకున్న మహావైరాగ్యమూర్తి అయ్యప్ప. తన దీక్షను స్వీకరించి జీవితాన్ని సాధనామయం చేసుకున్న భక్తులకు జీవన్ముక్తిని ప్రసాదిస్తాడు అయ్యప్పస్వామి.
అయ్యప్ప నామ విశిష్టత
అయ్యప్ప అంటే పెద్ద, తల్లి, తండ్రి, పూజ్యుడు, గురువు, వాత్సల్యాన్ని అందించేవాడని అర్థం. అంటే భక్తులకు తల్లిలా లాలన, పాలన, తండ్రిలా రక్షణ పోషణ బాధ్యతల్ని వహించేవాడు. అయ్యప్పకు శాస్త, ధర్మశాస్త, మహాశాస్త అనే నామాలు కూడా ఉన్నాయి. ఇవి ధర్మాన్ని శాసించేవాడు, ధర్మ మార్గం చూపేవాడు, నియమాలను సృష్టించి భక్తుల జీవితాన్ని పరిపుష్టం చేసే గురువు, జ్ఞానాన్ని, ముక్తిని ప్రసాదించే దైవం- అనే అర్థాలను సూచిస్తాయి.
రజోగుణ నియంత్రణ
శబరిమల దేవస్థానంలో దర్శనమిచ్చే అయ్యప్ప విగ్రహం యోగమూర్తి. వీరాసనంలో కూర్చున్న రూపం, మోకాలిపై యోగపట్టం, నిటారుగా వెన్నెముక- ఇవన్నీ యోగ సాధనా సూచనలు. చేతుల్లో చిన్ముద్ర, ముఖంలో ప్రశాంతత, అపార కరుణ సాధకుని అంతరంగంలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాయి. అయ్యప్ప వాహనం పులి. దానిపై స్వారీచేయడం రజోగుణాన్ని నియంత్రణలో పెట్టుకోవడాన్ని సూచిస్తుంది. దిగువన విధ్వంసమైన మహిషి తమస్సుకు ప్రతీక. ఈ రూపం యోగశాస్త్రానికి చిత్రరూప వ్యాఖ్యానం లాంటిది.
అంతరంగ శుద్ధి
శబరిమల యాత్రకు ముందుగా 40 రోజులు (మండలం) దీక్ష పాటిస్తారు. నల్లని వస్త్రాలు, భస్మధారణ, భూశయనం, సాత్వికాహారం, బ్రహ్మచర్యం, ఇంద్రియనిగ్రహం- ఇవన్నీ శారీరక మమకారాన్ని తగ్గించి అంతరంగాన్ని శుద్ధి చేసే ఆచారాలు. దీక్షితులు పరస్పరం ‘స్వామి’ అని పిలుచుకోవడం- ‘సమం సర్వేషు భూతేషు, సర్వం బ్రహ్మమయం జగత్’ అనే ఉపనిషత్తు భావాల్ని ఆచరించడమే. కుల, మత, జాతి, వర్ణ భేదాలు లేవు. అందరూ స్వాములే. తలపై బ్రహ్మరంధ్ర స్థానంలో ఇరుముడితో శబరిమల వెళ్లడం మన ఆలోచనలన్నీ పరమపదం దిశగా మళ్లించాలని బోధిస్తే, 18 పవిత్ర మెట్లు 18 గుణదోషాలపై విజయం సాధించమని సూచిస్తాయి. పంపానదిలో స్నానం, అడవిదారిలో సంకటాలు, గిరిశిఖర సన్నిధి- జీవుడు దేవుడివైపు సాగించే అంతర్గత యాత్రకు ప్రతీకలు. ఇలా అయ్యప్పదీక్ష ఉపనిషత్తులోని తత్వమసి వాక్యానికి క్రియారూపం. అందరూ పరబ్రహ్మ స్వరూపులే అనే సందేశాన్ని ఆచరణలో అనుభవింపజేసే సాధనామార్గం ఈ దీక్ష.
పూర్ణ పుష్కల భావం
అయ్యప్ప స్వామికి పూర్ణ, పుష్కల అనే ఇద్దరు దేవేరులు ఉన్నట్లు పురాణాలు తెలియ జేస్తున్నాయి. నైష్ఠిక బ్రహ్మచారి అయిన అయ్యప్ప అనుగ్రహానికి తాత్విక ప్రతీకలు ఈ పూర్ణ, పుష్కల. తన భక్తులకు అయ్యప్ప అనుగ్రహాన్ని పూర్తిగా, సమృద్ధిగా అనుగ్రహిస్తాడన్నది అంతరార్థం. గణపతికి సిద్ధి, బుద్ధిలను భార్యలుగా పేర్కొన్నట్లే పూర్ణ, పుష్కల తాత్వికతకు ప్రతీక. మహిషి తన తామసత్వాన్ని వదలి మళ్లీ జన్మించి స్వామిని వివాహం చేసుకోమని కోరిందనీ, శబరిమలకు కన్నెస్వాములు రాని సంవత్సరం ఆమెని వివాహం చేసుకుంటానని స్వామి వరమిచ్చాడనేది పౌరాణిక కథనం.
తమసోమా జ్యోతిర్గమయ
మన సనాతన ధర్మం ‘తమసోమా జ్యోతిర్గమయ’ అని చెబుతోంది. అజ్ఞానం అనే అంధకారం నుంచి జ్ఞానజ్యోతి దిశగా ప్రయాణించాలి. అయ్యప్ప గాథ ఈ సందేశాన్నే అందిస్తుంది. తమస్సు (మహిషి) నశించాలి, రజస్సు (పులి) నియంత్రణలోకి రావాలి, సాత్వికత (పాలు) జీవితానికి మూలమవ్వాలి. అలాంటి స్థితికి దారి చూపే పరమ శక్తి స్వరూపుడే అయ్యప్ప. వ్యసనాలు, ధర్మవిరుద్ధ కార్యాల నుంచి దూరమయ్యేందుకు అయ్యప్పదీక్ష దోహదం చేస్తుంది. చెడు అలవాట్లు వదలి బ్రహ్మచర్యం, జపం, ధ్యానం, భజనలతో గడిపే మండలదీక్ష మనసును శుద్ధి చేస్తుంది. ‘స్వామియే శరణం అయ్యప్ప’ అనే నినాదం- సమానత్వం, సహానుభూతి, నియమాచారాలను అలవరుస్తుంది.
అరణ్యం నుంచి అంతఃపురంలో అడుగుపెట్టి, బిడ్డలు లేని రాజమాతకు సంతానాన్ని అనుగ్రహించాడు అయ్యప్ప. దీక్ష చేపట్టిన భక్తుల్లో తామస గుణాలను పరిహరించి తన్మయ స్థితిని కలిగిస్తాడు. ఆ స్వామి అనుగ్రహంతో అలౌకిక ఆనందం లభిస్తుంది.





