News

సౌభాగ్య విధానంలో పంటల సాగుతో మేలు

183views

‘‘ప్రకృతి వైపు పయనించి అందరం ఆరోగ్యంగా ఉందామా? లేక ఇలాగే ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేద్దామా’’ అని త్రిదండి చినజీయర్‌స్వామి ప్రశ్నించారు. సౌభాగ్య విధానంలో పంటల సాగుపై కృష్ణా జిల్లా గూడూరు మండలం పినగూడూరులంక గోసదన్‌లో సేవ్‌ సంస్థ నిర్వాహకుడు మేకపోతుల విజయరామ్‌ ఆధ్వర్యంలో రైతులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చినజీయర్‌స్వామి మాట్లాడుతూ.. భూమి ఆరోగ్యంగా ఉంటేనే అందరం ఆరోగ్యంగా ఉంటామన్న విషయాన్ని గుర్తించాలన్నారు. విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగు మందులు చల్లి 50 బస్తాలు పండుతున్నాయని సంతోషించడం తగదన్నారు. ఇలాగే వ్యవసాయం చేస్తే కొన్నాళ్లకు భూమి సాగుకు పనికి రాకుండా పోతుందని ఆందోళన వ్యక్తంచేశారు.

ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పాదయాత్ర
ప్రకృతి సమతుల్యత లోపించి అత్యధిక ఉష్ణోగ్రతలు, వర్షాలు, చలి నమోదవడం అందరం చూస్తున్నాం. ఈ పరిస్థితి మారాలంటే అందరూ ప్రకృతి వైపు పయనించాలని చినజీయర్‌స్వామి కోరారు. యంత్రాలతో వరిని కోయడం ద్వారా పశుగ్రాసానికి తీవ్ర కొరత ఏర్పడుతోందని, టన్నుల బరువు ఉండే యంత్రం పొలంలో తిరిగితే భూమి కూడా పాడైపోతుందన్నారు. విజయరామ్‌ వరికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన సౌభాగ్య విధానం.. ఎకరాకు ఏడాదికి రూ.4.50 లక్షల వరకు ఆదాయం తెస్తుందని తెలిపారని, పంటలను తాను పరిశీలించగా ఆశ్చర్యం వేసిందన్నారు. ఇది అందరూ అవలంబించదగ్గ విధానమని చెప్పారు. ఈ తరహాలో సాగుచేస్తున్న రైతులను సమీకరించి ప్రజలను చైతన్యం చేసేందుకు విజయరామ్‌ నేతృత్వంలో రాష్ట్రంలో పాదయాత్ర చేస్తామని ప్రకటించారు. తాను సాగు చేసిన విధానం గురించి ఈ సందర్భంగా రైతులకు విజయరామ్‌ వివరించారు.