ArticlesNews

సామాజిక ప‌రివ‌ర్త‌న‌కు కృషి చేసిన భగత్ నర్సీ మెహతా

168views

( డిసెంబర్ 17 – న‌ర్సీ మెహ‌తా జయంతి )

న‌వవిధ భ‌క్తి మార్గాల్లో కీర్త‌నం కూడా ఒక‌టి. భార‌త‌దేశంలో వాగ్గేయ‌కారులైన భ‌క్తులు ఎంద‌రో ఉన్నారు. సామాన్య ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యే భాష‌లో గీతాలు, కీర్త‌నలు పాడుతూ భ‌క్తి ప్ర‌చారం చేశారు. సంకీర్త‌నా ఉద్య‌మ‌కారుడిగా పేరొందిన న‌ర్సీ మెహ‌తాను గుజ‌రాతీయులు త‌మ భాష‌లో ఆది క‌విగా భావిస్తారు. భ‌గ‌వంతుడి చింత‌న‌, స్వామి గుణాల‌ను గానం చేయ‌డ‌మే జీవితంగా గ‌డిపిన నిరాడంబ‌ర భ‌క్తాగ్ర‌ణ్య‌డు ఆయ‌న‌. భ‌క్త వాఙ్మ‌యంలో మ‌ణిపూస‌ల‌వంటి న‌ర్సీ కీర్త‌నలు వివిధ భాష‌ల్లోకి అనువాద‌మై భ‌క్త జ‌నుల నాలుక‌ల‌పై నేటికీ న‌ర్తిస్తునే ఉన్నాయి. న‌ర్సీ రాసిన కీర్త‌న‌ల‌న్నీ భ‌జ‌న‌లుగా, ప‌దాలుగా వ్యాప్తి చెందాయి. త‌న ర‌చ‌న‌ల ద్వారా సామాజిక ప‌రివ‌ర్త‌న‌కు పాటుప‌డ్డారు. శ్రీ కృష్ణ భక్తాగ్రేస‌రుడిగా 22వేల కీర్త‌న‌లు, గీతాల‌ను గుజరాతీ భాషలో ర‌చించారు. సుదామ చ‌రిత, గోవింద్ గమన్, శృంగార మాల‌, వసంత్ నాపదో కృష్ణ జన్మ నాపదో మొద‌లైన ప్ర‌సిద్ధ ర‌చ‌న‌లు చేశారు. ఆయ‌న ర‌చ‌న‌లు, గీతాలు, కీర్త‌నలు పండితులు, సామ‌న్యుల్లో భ‌క్తి భావాన్ని నింపాయి. త‌ద్వారా ప్ర‌జ‌ల‌లో తామంతా ఒక్క‌టే అనే ఐక్య‌తా భావాన్ని ఆయ‌న క‌లిగించారు. భ‌క్త మీరాబాయికి స‌మ‌కాలికుడైన న‌ర్సీకి ఆమెతో ప‌రిచ‌యం కూడా ఉంద‌ని చెబుతారు. ఈయ‌న‌పై భ‌క్త జ‌య‌దేవుడి ప్ర‌భావం ఉంది.

న‌ర్సీ మెహ‌తా 1414వ సంవ‌త్స‌రంలో ప్ర‌స్తుత గుజ‌రాత్‌లోని భావ్‌న‌గర్ జిల్లా తలాజా పట్టణంలో నివ‌సించే వైష్ణవ కుటుంబంలో జ‌న్మించారు. అయిదేళ్ల వ‌య‌సులోనే త‌ల్లిదండ్రుల‌ను కోల్పోవ‌డంతో అతడిని అమ్మమ్మ జయగౌరి దత్తత తీసుకుంది.ఆయ‌న‌కు ఎనిమిదేళ్ల వ‌ర‌కూ మాట‌లే రాలేదు. వారు నివ‌సించే గ్రామానికి వ‌చ్చిన ఒక సాధువు ద‌గ్గ‌ర‌కు తీసుకువెళ్ల‌గా.. రాధా మాధ‌వ్ అన‌మ‌ని చెప్పి న‌ర్సీ త‌ల‌ను ఆయ‌న చేతితో తాక‌గానే ఆ మాట‌లు ప‌లికాడు. 1429లో మానిక్ బాయిని వివాహం చేసుకున్నాడు. భార్యతో క‌ల‌సి జునాగఢ్ లోని తన సోదరుడు బ‌న్సీధర్ ఇంటిలో ఉండేవారు. వ‌దిన దురిత గౌరి వ‌ల్ల చాలా క‌ష్టాల‌ను అనుభ‌వించాడు. ఇవ‌న్నీ భ‌రించ‌లేక అడ‌వికి వెళ్లి ధ్యానం చేసుకుంటుండ‌గా శివుడు ప్ర‌త్య‌క్ష‌మై అత‌డిని గోకుల ధామానికి తీసుకెళ్లి రాధాకృష్ణుల లీలా వైభవం చూపించాడట‌. భార్యా పిల్ల‌ల‌ను పోషించుకోవ‌డానికి కాప‌లాదారుగా ప‌నిచేశాడు. ఒక‌సారి సంకీర్త‌న‌ల‌లో ఓల‌లాడుతూ త‌న విధి నిర్వ‌హ‌ణ‌ను మ‌ర్చిపోతే సాక్షాత్తూ ఆ శ్రీ‌కృష్ణ భ‌గవానుడే వ‌చ్చి త‌న భ‌క్తుడి స్థానంలో నిల‌బ‌డ్డాడని చెబుతారు. సంకీర్త‌నే జీవితంగా, శ్వాస‌గా బ‌తికిన న‌ర్సీ ఏ ఉద్యోగం స‌రిగా చేయ‌లేక‌పోయాడు. తన జీవితపు చ‌ర‌మాంకంలో ఆయ‌న మంగ్రోల్ కు చేరాడు. అక్కడ 79 సంవత్సరాల వయస్సులో న‌ర్సీ మెహ‌తా మరణించాడని నమ్ముతారు. మంగ్రోల్ లోని శ్మశానవాటికను ‘నర్సింగ్ శ్మ‌శాన్‌’ అని పిలుస్తారు.

న‌ర్సీ మెహ‌తా పేరు చెప్ప‌గానే ముందుగా గుర్తొచ్చే గీతం వైష్ణ‌వ జ‌న‌తో తెనె క‌హియే. సందేశాత్మ‌క‌మైన ఈ సంకీర్త‌నలో నిజ‌మైన వైష్ణ‌వుడు ఎలా ఉండాలో న‌ర్సీ బోధించాడు. మ‌న‌సులో ఎలాంటి అహంకార భావ‌న లేకుండా ఇత‌రుల దుఃఖాన్ని దూరం చేయ‌డానికి ప్ర‌య‌త్నించేవాడే భ‌గ‌వంతుడి నిజ‌మైన భ‌క్తుడు అని తెలిపాడు. మ‌హాత్మా గాంధీజీకి ఈ కీర్త‌న చాలా ఇష్టం. సబర్మతి ఆశ్రమంలో రోజూ పాడే ప్రార్థనల్లో ఇదీ ఒకటి. గాంధీజీ కంటే ఎంతో కాలం ముందే ఆయ‌న గుజ‌రాత్‌లో కుల‌వివ‌క్ష, అస్పృశ్య‌తల‌కు వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్తారు. తాను ర‌చించిన కీర్త‌న‌లను వీధులను శుభ్రం చేసేవారి ఇళ్ల‌లో ఉంచారు. గాంధీజీ చేప‌ట్టిన హ‌రిజ‌నోద్ధ‌ర‌ణ‌కు. అస్పృశ్య‌త నివార‌ణ ఉద్య‌మానికి న‌ర్సీ మెహ‌తా స్ఫూర్తిగా నిలిచారు. ఆయ‌న ర‌చ‌న‌ల్లో క‌నిపించే హ‌రిజ‌న అనే ప‌దాన్నే త‌ద‌నంత‌ర కాల‌లో గాంధీజీ ఉప‌యోగించారు. అస్పృశ్య‌త నివార‌ణ కోసం ఏర్పాటు చేసిన సంస్థ‌కు హ‌రిజ‌న్ సేవ‌క్ సంఘ్ అని పేరు కూడా పెట్టారు. న‌ర్సీ మెహ‌తా ర‌చ‌న‌ల‌తో ప్ర‌భావిత‌మైన గాంధీజీ 1933లో త‌న వార‌ప‌త్రిక యంగ్ ఇండియాకు హ‌రిజ‌న్ అని పేరు పెట్టారు. భ‌క్తి సాహిత్యం ద్వారా స‌మాజాన్ని జాగృత‌ప‌రిచిన భ‌గ‌త్ న‌ర్సీ మెహ‌తా చిర‌స్మ‌ర‌ణీయులు.