
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన విడుదల చేసింది. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన టికెట్ల విడుదల తేదీలను ప్రకటించింది. భక్తులు ముందుగానే టికెట్లు, దర్శన టోకెన్లు పొందేందుకు వీలుగా షెడ్యూల్ను వెల్లడించింది.
దర్శన టికెట్ల విడుదల షెడ్యూల్ ఇదే
టీటీడీ ప్రకటించిన వివరాల ప్రకారం..
– నవంబర్ 28: ఉదయం 10 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల విడుదల.
– నవంబర్ 30: ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల.
– డిసెంబర్ 1 నుంచి 5 వరకు: స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కోసం ఆన్లైన్ ఈ-డిప్ నమోదు.
– డిసెంబర్ 7: మధ్యాహ్నం 3 గంటలకు ఈ-డిప్ ద్వారా టోకెన్ల కేటాయింపు.
డిసెంబర్ 20న వైకుంఠ ఏకాదశి, డిసెంబర్ 21న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలైన డిసెంబర్ 20, 21 తేదీల్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే తొలి రెండు రోజులు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేయాలని నిర్ణయించింది.
సామాన్య భక్తులకు అధిక సంఖ్యలో శ్రీవారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. వైకుంఠ ద్వార దర్శనాల కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.
దర్శన టికెట్లు, టోకెన్ల కోసం భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ను మాత్రమే వినియోగించాలని అధికారులు సూచించారు. నకిలీ వెబ్సైట్లు, అనధికారిక వ్యక్తులు, మధ్యవర్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో శ్రీవారి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులు ముందుగానే టికెట్ల షెడ్యూల్ను గమనించి తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ సూచించింది.





