News

నంద్యాలలో ఘనంగా హిందూ సమ్మేళనాలు

579views

నంద్యాల జిల్లా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా మూడవ చరణమైన హిందూ సమ్మేళనాలు సంరంభంగా ప్రారంభమయ్యాయి. నంద్యాల నగరంలో 20 బస్తీలలో హిందూ సమ్మేళనాలు జరిగాయి. అందులో మొదటి హిందూ సమ్మేళనం పద్మావతి నగర్ శ్రీ కృష్ణ మందిరంలో డిసెంబర్ 6 వ తేదీ సాయంత్రం, వైభవంగా జరిగింది. కృష్ణ మందిరం కమిటీ అధ్యక్షుడు శ్రీ పార్థసారధి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రవచన కారులు శ్రీ సి.హెచ్ హరిబాబు విశ్రాంత కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, ప్రాంత కుటుంబ ప్రబోధన్ ప్రముఖ శ్రీ పుట్ట శేషు ప్రధాన వక్తగా పాల్గొన్నారు.

ఆది అంతం లేని సనాతన ధర్మం ప్రపంచం అంతటా వ్యాపించి ఉంటుందని ప్రవచన కారులు శ్రీ హరి బాబు తెలియజేశారు. సనాతన ధర్మం లేనిదే ప్రపంచానికి మనుగడే లేదన్నారు. రోమ్, గ్రీస్, మెసపు టోమియన్ లాంటి దేశాలు ఎంతో గొప్ప నాగరికతలుగా కీర్తించబడినప్పటికి కేవలం ఇరవై ముప్పై సంవత్సరాల వ్యవధిలో ఇస్లాంకు లొంగిపోయాయని తెలిపారు. 800 సంవత్సరాల మొగలాయి, 200 సంవత్సరాల బ్రిటీష్ పాశవిక దమనకాండ కొనసాగించినా సనాతన ధర్మం నిలదొక్కుకుని నేడు విజయపథం వైపు పురోగమిస్తున్నది అని తెలియజేశారు. మరి ఇంత గొప్ప మతం పరాయి మత పీడనకు తలఒగ్గడానికి కారణం మనలో ఉన్న అనైక్యత అసూయ ద్వేషాలు అని తెలిపారు.

ప్రధాన వక్త ప్రసంగిస్తూ, సమాజానికి కులవ్యవస్థ రాచపుండు లాంటిదని దాన్ని నయం చేసుకుని, సమరసత వైపు సాగాలనే లక్ష్యంతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దేశంలో ప్రారంభమై ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్చంద సంస్థగా ఆవిర్భవించి విశ్వవ్యాప్తమైందని తెలిపారు. సంఘ్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మనం సంకల్పబద్దులమై, మనలో ఉన్న బలహీనతలను అధిగమించి సామాజిక సమరసత, పర్యావరణ సంరక్షణ, ఆదర్శ కుటుంబ వ్యవస్థ, స్వదేశీ జీవనవిధానం, పౌర విధులు చక్కగా పాటిస్తూ పరమ వైభవ స్థితి అయినటువంటి విశ్వగురు స్థానానికి ఎదగాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో పరివార సంస్థలు, పదాధికారులు స్థానిక పెద్దలు పాల్గొన్నారు. చిన్నారుల ప్రదర్శించిన కోలాటం, కూచిపూడి నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

(సంఖ్య బాల – 51, తరుణ – 250, మహిళలు – 136, మొత్తం = 437. శాంతి మంత్రం, భోజనం మంత్రం తదుపరి అల్పాహారంతో కార్యక్రమం సంపన్నమైంది).

అలాగే డిసెంబర్ 7 వ తేదీన నూనెపల్లె శివాలయం బస్తీలో జరిగిన హిందూ సమ్మేళనంలో నంద్యాల ఇస్కాన్ అధ్యక్షులు శ్రీమాన్ రఘు వంశీ గారు సనాతన ధర్మం గురించి వివరించారు. ప్రధాన వక్త విభాగ ఇతిహాస్ సంకలన ప్రముఖ్ శ్రీ మన్నవ వేణుగోపాల్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రస్థానం, ఇంతవరకు సంఘ్ చేస్తున్న పని, ఇకనుంచి సంఘం ఏ దిశలో పని చేయాలనుకుంటుందో వివరించారు.

( సంఖ్య బాల – 70, తరుణ – 150, మహిళలు – 100, మొత్తం = 320, యధావిధిగా శాంతి మంత్రం, భోజన మంత్రం, అల్పాహారంతో కార్యక్రమం సంపన్నమైంది).