
( డిసెంబరు 11 – సుబ్రహ్మణ్య భారతి జయంతి )
అక్షరాన్నీ, అలజడినీ సమంగా ప్రేమించిన కవి సుబ్రహ్మణ్య భారతి. అందుకు ఆయన పేరు చివర ఉన్న ‘భారతి’ నిదర్శనం. ఆయన జీవించింది 39 సంవత్సరాలే అయినా అటు స్వరాజ్య సంగ్రామంలోనూ ఇటు ప్రజాహిత సాహితీ సృష్టిలోనూ తనదైన చెరగని ముద్ర వేశారు. కన్యాకుమారి నుండి కశ్మీరు వరకున్న అఖండ భారతాన్ని తన మాతృదేశమని విశ్వసించిన సుబ్రహ్మణ్య భారతి భారతీయులు విభజితులై ఉన్నా వారంతా ఒకే తల్లి పిల్లలనీ, వారి పట్ల విదేశీయుల జోక్యం చేసుకోవలసిన పని ఏముందని నిశితంగా ప్రశ్నించారు. తీవ్ర జాతీయవాదం వైపు మొగ్గు చూపిన సుబ్రహ్మణ్యం భారతికి తిలక్, అరవిందుడు వంటివారు ఆదర్శం. స్వాతంత్ర్య సాధన దీక్షాదక్షుడై స్వాతంత్ర్య రహితమైన జీవితం వ్యర్థమని కవిత్వీకరించాడు.
అచంచల దేశభక్తుడు, అలుపెరుగని పోరాట యోధుడు, మహాకవి, విశిష్ట పాత్రికేయుడు, సమదర్శి, ఆధ్యాత్మిక చింతన, మానవతావాదం కలగలిసిన మహా మనీషి సుబ్రహ్మణ్య భారతి 1882 డిసెంబరు 11న తమిళనాడులోని అప్పటి తిరునల్వేలి జిల్లా ఎట్టయాపురంలో జన్మించారు. తల్లి పేరు లక్ష్మీ అమ్మాళ్, తండ్రి పేరు సుబ్రహ్మణ్యం అయ్యార్. సుబ్రహ్మణ్యం భారతికి తల్లిదండ్రులు పెట్టిన పేరు చిన్నస్వామి. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం తిరునల్వేలిలో సాగగా, పదకొండు సంవత్సరాల వయస్సులోనే కవితా రచన మొదలుపెట్టారు. ఆయన ప్రతిభకు బాల్యంలోనే సరస్వతీ దేవి పేరిట ‘భారతి’ అనే బిరుదు అందుకున్నారు. తమిళ సంప్రదాయాన్ని అనుసరించి తండ్రి పేరు ‘సుబ్రహ్మణ్యం’, బిరుదు ‘భారతి’తో కలిపి ‘సుబ్రహ్మణ్య భారతి’ అయ్యాడు.
సుబ్రహ్మణ్య భారతి ఉన్నత విద్యాభ్యాసానికి వారణాసి వెళ్లారు. అక్కడ గంగాతీరం కవిగా భారతి పరిణతికి దోహదం చేసింది. వారణాసి, ప్రయాగ్‌రాజ్‌లో సంస్కృతం, హిందీ అభ్యసించారు. ఆ భాషల్లో ధారాళంగా మాట్లాడగల ప్రావీణ్యం సంపాదించడంతో పాటు తెలుగు, మలయాళం, బెంగాలీ వంటి భారతీయ భాషలతో పాటు ఆంగ్లం, ఫ్రెంచ్ వంటి విదేశీ భాషలను సైతం నేర్చుకున్నారు. సుబ్రహ్మణ్య భారతి కొంత కాలం ఎట్టయాపురం రాజా కొలువులో, మధురై సేతుపతి పాఠశాలలో తమిళ పండితుడిగా ఉద్యోగం చేసిన తర్వాత తన ప్రవృత్తికి తగ్గటు పత్రికారంగంలోకి ప్రవేశించారు. అలా 1904లో స్వదేశీ మిత్రన్ అనే దినపత్రికలో సహాయ సంపాదకునిగా చేరారు. పాత్రికేయ వృత్తిలో ఉండగానే రాజకీయ సంబంధాలు ఏర్పర్చుకున్నారు. అనేకమంది దేశభక్తులతో, ఆధ్యాత్మికవేత్తలతో పరిచయాలు పెంచుకున్నారు. సోదరి నివేదితను కలకత్తాలో కలుసుకున్నారు. ఆమె ఉపదేశం భారతి వ్యక్తిత్వాన్ని బలంగా ప్రభావితం చేసింది. ‘భారతమాత’ అనే పవిత్ర భావన ఉదయించడానికి సోదరి నివేదితతో సంభాషణే కారణమని సుబ్రహ్మణ్య భారతి అనేవారు.
స్వదేశీ మిత్రన్‌లో పని చేసిన తర్వాత తమిళ పత్రిక ‘ఇండియా’, ఆంగ్ల పత్రిక ‘బాలభారతం’లను సుబ్రహ్మణ్య భారతి ప్రారంభించారు. ఈ రెండు పత్రికల ద్వారా భారతి తన ప్రతిభ, సృజనాత్మకతల విశ్వరూపం ప్రదర్శించారు. కవిత్వం, జాతీయవాదం, ఆధ్యాత్మికం, రష్యా విప్లవం, ఫ్రెంచ్ విప్లవం ఇలా ఎన్నో అంశాలను ఆయన పాఠకులకు అందించేవారు. ఆ రోజుల్లోనే ఆయన బ్రిటిష్ దమననీతిని ఖండించడంతో పాటు అట్టడుగు వర్గాల మీద కొందరు భారతీయులు ప్రదర్శిస్తున్న తీరును కూడా నిరసించేవారు. మహిళా స్వాతంత్ర్యం, సాధికారతల గురించి ఆ రోజుల్లోనే భారతి నవ సూత్రాలను ప్రతిపాదించారు. దేశీయ పత్రికలపై బ్రిటిష్ ప్రభుత్వం ఆంక్షల కారణంగా భారతి ఫ్రెంచి పాలనలోని పుదుచ్చేరి వెళ్లి అక్కడ నుంచే కార్యకలాపాలు సాగించేవారు. సుబ్రహ్మణ్య భారతి ప్రతి రచనలోనూ జాతీయ సమైక్యతా భావం వెల్లివిరిసేది. ఆయన రచనల్లో కుయల్ పట్టు, పాంచాలీ శపథం, కన్నయ్యపట్టు ప్రధానమైనవి. భారతి కవితల్ని ఆచార్య చల్లా రాధాకృష్ణ శర్మ తెలుగులోకి అనువదించారు. ‘సింధు నదిని పండు వెన్నెలలో చేర దేశపు వయసు కన్నెలతో తేట తెలుగున పాటపాడుతూ పడవ నడిపీ తిరిగివచ్చెము’ అన్న భారతి సుందర తెలుంగై అని తెలుగు భాషను ప్రశంసించారు.
కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు అనే సమైక్య భావనను మధుర కవితామయం చేశారు. కుల భేదాలు ఎందుకని ప్రబోధించిన సుబ్రహ్మణ్య భారతి కనకలింగం అనే వెనకబడిన వర్గానికి చెందిన బాలుడికి ఉపనయనం జరిపించారు. దళితులను తన ఇంటికి ఆహ్వానించి గౌరవించేవారు. 1921 సెప్టెంబరు 12న పరమపదించిన సుబ్రహ్మణ్య భారతి మనుషుల్లో ఉన్నతాదర్శాల కోసం ఆ రోజుల్లోనే తపించిన జాతీయ సమైక్యతా జ్యోతి, స్వరాజ్య ఖ్యాతి..





