News

వక్ఫ్‌ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ గడువు పొడిగింపునకు సుప్రీం నిరాకరణ

90views

వక్ఫ్‌ ఆస్తిగా రికార్డుల్లో నమోదు కానప్పటికీ ఏళ్ల తరబడి మతపరమైన కార్యక్రమాలకు ఉపయోగపడుతున్న కారణంగా వక్ఫ్‌ ఆస్తిగా పరిగణిస్తూ వచ్చిన ‘వక్ఫ్‌ బై యూజర్‌’ ఆస్తులతోపాటు ఇతర వక్ఫ్‌ ఆస్తులన్నింటినీ ఉమీద్‌ పోర్టల్‌ ద్వారా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే గడువును పొడిగించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఇచ్చిన గడువు ముగిసేలోగా పిటిషనర్లు సంబంధిత ట్రైబ్యునళ్లను ఆశ్రయించి సమస్యను పరిష్కరించుకోవాలని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ ఆగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

‘సెక్షన్‌ 3బీని మా దృష్టికి తెచ్చారు. అయితే దరఖాస్తుదారుల సమస్యకు ట్రైబ్యునళ్ల సమక్షంలో పరిష్కారం ఉంది. 6 నెలల గడువుకు ముందు ట్రైబ్యునళ్లను ఆశ్రయించి పరిష్కారం కోరే స్వేచ్ఛను పిటిషనర్లకు ఇస్తున్నాం. ఇందుకు సంబంధించి మా వద్దకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ పక్కనబెడుతున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. వక్ఫ్‌ ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు గడువును పొడిగించాలని కోరుతూ ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు, ఏఐఎంఐఎం నాయకుడు అసదుద్దీన్‌ ఒవైసీ తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వక్ఫ్‌ ఆస్తుల్ని రిజిస్టరు చేయడానికి ప్రభుత్వం విధించిన 6 నెలల గడువు పూర్తి కావచ్చిందని ఒక న్యాయవాది తెలిపారు.