News

ప్రపంచంలో అత్యంత ఎత్తైన శివలింగం..

50views

ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఈ శివలింగాన్ని బిహార్‌లోని చంపారన్ జిల్లాలో ప్రతిష్ఠించనున్నారు. దీన్ని తమిళనాడులోని మహాబలిపురం నుంచి చంపారన్ తరలిస్తున్నారు. 114 టైర్లున్న భారీ హైడ్రాలిక్ ట్రక్కు మీద ఈ శివలింగాన్ని తరలిస్తున్నారు. అనేక ప్రాంతాల మీదుగా వెళుతున్న ఈ శివలింగాన్ని చూసిన జనాలు అత్యంత ఎత్తైన శివలింగం అంటూ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ శివలింగం ప్రతిష్ఠ విషయానికి వస్తే.. చంపారన్ జిల్లా, చాకియా కేసరియా వద్ద మహావీర్ మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విరాట్ రామాయణ ఆలయం నిర్మిస్తున్నారు. ఈ గుడిలో ప్రపంచంలోనే అతి పెద్ద ఏకశిలా శివలింగాన్ని ప్రతిష్ఠించబోతున్నారు.. ఈ శివలింగాన్ని మహాబలిపురంలోని ఒకే ఒక్క భారీ గ్రానైట్ శిలను ఎంచుకుని, మొత్తం గ్రానైట్‌తో చెక్కారు. దీన్ని చెక్కడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఈ శివలింగం సుమారు 33 అడుగుల పొడవు ఉంది. 210 మెట్రిక్ టన్నుల బరువున్న ఈ శివలింగం విలువు రూ.3 కోట్లు. మహాబలిపురం నుంచి బిహార్ చేరడానికి దాదాపు 20-25 రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.

శివలింగం బరువును దృష్టిలో ఉంచుకుని దీన్ని తరలించడానికి.. 114 టైర్లున్న హైడ్రాలిక్ ట్రక్‌ని వినియోగిస్తున్నారు. ప్రత్యేక ఇంజనీరింగ్ బృందం పర్యవేక్షణలో.. ఈ భారీ శివలింగాన్ని బిహార్ కు తరలిస్తున్నారు. శివలింగాన్ని ప్రతిష్టించబోయే విరాట్ రామాలయం ఎత్తు… కంబోడియాలోని 12వ శతాబ్దపు అంగ్కోర్ వాట్ ఆలయం కన్నా మరింత ఎత్తుగా ఉండేలా డిజైన్ చేసి నిర్మిస్తున్నారు.