ArticlesNews

జీవన మార్గదర్శకం భగవద్గీత సారాంశం

49views

( మార్గశిర శుక్ల ఏకాదశి – గీతా జయంతి )

హిందువులు జరుపుకునే ప్రధానమైన పండుగల్లో గీతా జయంతి కూడా ఒకటి. భగవద్గీత పుట్టిన రోజుగా ఈ గీతా జయంతిని జరుపుకుంటారు. ప్రతియేటా మార్గశిర మాసం శుక్ల పక్ష ఏకాదశి రోజు గీతా జయంతిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం డిసెంబరు 1న గీతా జయంతిని జరుపుకుంటున్నాము. భగవద్గీత అనేది అర్జునుడు కర్తవ్య నిర్వహణలో తికమక పడుతున్న సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఉపశమనంగా అనుగ్రహించిన మహోపదేశం. ఈ పవిత్ర గ్రంథం అర్జునుడికే కాదు కర్తవ్య నిర్వహణలో భాగంగా ఎదురయ్యే సమస్యలకి, సందిగ్ధతకు సమాధానంగా నేటి ఆధునిక యుగంలోనూ భగవద్గీత ప్రమాణంగా నిలుస్తోంది.

పవిత్రమైన గీతా జయంతి రోజున శ్రీకృష్ణుడిని ప్రత్యేకించి ఆరాధిస్తారు. అలాగే.. భగవద్గీత పారాయణం చేయడం వల్ల సకల శుభాలు జరుగుతాయని, జ్ఞానం, ఓర్పు, నేర్పుతో పాటు అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తాయని నమ్మకం. ఈరోజున ఓం కృష్ణాయ నమః లేదా ఓం శ్రీ కృష్ణ శరణం మమ.. అనే మంత్రాలను జపించడం శుభప్రదం. గీతా జయంతి రోజున కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతోపదేశాన్ని కౌరవ రాజు అయిన ధృతరాష్ట్రుడికి సంజయుడు వినిపించాడట. ఈ గ్రంథం మనకు లభించిన వరంగా భావించాలి. సుమారు 6,000 సంవత్సరాల పూర్వం ఉపదేశించబడినా నేటి ఆధునిక కాలపు మనుషులకు కూడా ఉపయోగపడుతుందంటే దీని విశిష్టత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ పవిత్ర గ్రంథం నేటికీ ఎంతో మందిని మంచి మార్గంలో నడిపిస్తుంది.

మనువు సర్వవేదమైనట్లు, గంగ సకలతీర్థరూపిణి అయినట్లు, శ్రీహరి సర్వదేవ మయుడైనట్లు భగవద్గీత సర్వ శాస్త్రమయం. ఇది సార్వకాలీనం, సార్వజనీనం. జ్ఞానపరిణతిని బట్టి ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క విధంగా బోధపడే నిత్యనూతన గ్రంథం. ఈ అష్టాదశాధ్యాయినికి గీత, గంగ, గాయత్రి, సీత, సత్య, వేదత్రయి, పర, అనంత, త్రిసంధ్య, సరస్వతి, బ్రహ్మవిద్య, బ్రహ్మవల్లి, ముక్తిగేహిని, అర్థమాత్ర, చిదానంద, భవఘ్న, భయనాశిని, తత్త్వార్థ జ్ఞానమంజరి అని పద్దెనిమిది పేర్లున్నాయి. భగవానుడైన శ్రీకృష్ణుడు ఉపదేశించాడు కనుక ‘భగవద్గీత’, పరబ్రహ్మను తెలిపే విద్య కనుక ‘బ్రహ్మవిద్య’ అని, వేదాంతాలను సంగ్రహించిన చెప్పినందున ‘ఉపనిషత్సారం’అంటారు.

మానవ జీవన గమనంలో అడుగడుగునా భయాందోళనలే. ఏదైనా కార్యం ఆరంభించే ముందు అది సరైనదేనా? అనే భయం… ప్రారంభించిన తరువాత సజావుగా సాగుతుందో? లేదో! అనే అనుమానం. పూర్తయ్యాక ఫలితంపై శంక. ఇక మృత్యుభయం ఉండనే ఉంటుంది. ఇలాంటి ఎన్నో అంశాల పట్ల మనిషిని జాగృత పరిచేదే భగవద్గీత. మానవాళికి కలిగే అనేకానేక సంశయాలను నివృత్తి చేసే ఆధ్యాత్మిక గ్రంథం భగవద్గీత. నిరాశా నిస్పృహలు, నిస్తేజం, నిస్సత్తువ లాంటివి ఆవరించి నప్పుడు గీతాసందేశం మార్గదర్శిగా నిలుస్తుంది.

మహాత్మాగాంధీ, వివేకానంద, వినోభాభావే, బాలగంగాధర్ తిలక్, ఐన్ స్టీన్, ఓపెన్ హేమర్ తదితరులు ఎందరికో ప్రేరణ నిచ్చింది గీత. నాకు ఏ సమస్య ఎదురైనా గీతలోని ఏదో ఒక పేజీ పరిష్కారం చూపుతుంది అనేవారు గాంధీజీ. ప్రముఖ అణు శాస్త్రవేత్త ఓపెన్ హేమర్ అణు విస్ఫోటన దృశ్యం తనకు భగవద్గీతలో విశ్వరూపసందర్శనాన్ని గుర్తు తెచ్చిందని చెప్పారు. ఆ సమయంలో తన నోటివెంట అప్రయత్నంగానే విశ్వరూపానికి సంబంధించిన శ్లోకాలు వచ్చాయని చెప్పారు. చాలా దేశాల్లో గీతను వ్యక్తిత్వ వికాస గ్రంథం పర్సనాలిటీ డెవలప్మెంట్ పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. అమెరికా, జర్మనీ, నెదర్లాండ్, బ్రిటన్ తదితర దేశాల్లో గీతను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు. ‘సృష్టిలో పరిణామం, మార్పులు అనివార్యం. ఏది ఆదిలో ఉన్నట్లు అంతంలో ఉండదు. జీవితం పరిమిత కాలం. నియమిత కాలంలో చేయగలిగే మంచిపనులే అపరిమిత తృప్తిని ఇవ్వగలుగుతాయి. తద్వారా జన్మ సార్థకమవుతుంది. ఈ జీవన సత్యమే భగవద్గీత పరమోపదేశం.