
భారతదేశ సంస్కృతి, భాషలపై చైనాలో ఉన్న ఆసక్తి కొత్త పుంతలు తొక్కుతోంది. సంస్కృతం, పాలీ వంటి ప్రాచీన భాషలపై అక్కడ కొంత మంది విద్యావేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. వారితో షాంఘైలోని భారత కాన్సుల్ జనరల్ ప్రతీక్ మాథుర్ ఇటీవల సమావేశం అయ్యారు. సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఎలాంటి సహకారం అవసరమో చర్చించారు. సంస్కృత అధ్యయనాలు, బౌద్ధ సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు కావాల్సిన సహకారం అందిస్తామన్నారు. భారత్-చైనా మధ్య వారధిగా నిలిచే ఈ ప్రయత్నాలు ఇరు దేశాల ప్రజలకు దగ్గరయ్యేందుకు ఉపకరిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
బీజింగ్ ఫారిన్ స్టడీస్ యూనివర్సిటీలో సంస్కృతం, పాలీ బోధించే అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జౌ లికున్, నరసింహ వర్క్‌షాప్ వ్యవస్థాపకురాలు లీ హన్సిలతో ప్రతీక్ మాథుర్ చర్చలు జరిపారు. సంస్కృత అధ్యయనాన్ని ముందుకు తీసుకెళ్లడం, బౌద్ధ సాహిత్యంపై పరిశోధనలు చేయడం, వినూత్నమైన సాంస్కృతిక ప్రాజెక్టుల విషయంలో పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. భారతదేశ ఖగోళ శాస్త్రం, క్యాలెండర్లు, సాహిత్యంపై తాను చేసిన పరిశోధన నుంచి తెలుసుకున్న విషయాలను డాక్టర్ జౌ లికున్ వివరించారు. నరసింహ వర్క్‌షాప్ లో భాగంగా భారత సంస్కృతి సంబంధిత సృజనాత్మక సేవలు, ఉత్పత్తుల గురించి లీ హన్సి వివరించారు.





