ArticlesNews

విశిష్ట వేదాంత బోధ శ్రీమద్భగవద్గీత

74views

శ్రీమద్భగవద్గీత పరమ పవిత్ర గ్రంథం. అదో విశిష్ట వేదాంత బోధగా వినుతికెక్కింది. అసంఖ్యాక భాష్యాలకు నిలయమై నిలిచింది. భగవద్గీతను భక్తిశ్రద్ధలతో చదివినవారు, విన్నవారు తమ కర్తవ్యాన్ని తెలుసుకుంటారు. పరోపకార భావంతో ముందుకెళ్తారు. ప్రతి ఒక్కరూ యుక్తాయుక్త విచక్షణతో ప్రవర్తిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని చెబుతుంది గీత. ఇది మానవుణ్ని మాధవుడి స్థాయికి చేర్చి ముక్తిని ప్రసాదిస్తుంది. భవబంధాలను తొలగించి ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించి శాంతిని చేకూర్చుతుంది.

సృష్టిలోని నిగూఢ రహస్యాలను కనుగొనడం మానవుడికి సాధ్యం కాదు. అందుకు ఈ లోకంలో ఆ పరమాత్ముడే శ్రీకృష్ణుడిగా అవతరించాల్సి వచ్చింది. ఆయన బోధనలే భగవద్గీత రూపంలో మనకు లభించాయి. మానవుడి మనసుకు అందని ఈశ్వరుణ్ని భగవద్గీతలో నిర్వచించిన విధంగా మరే ఇతర పవిత్ర గ్రంథాల్లోనూ వివరించడం కనబడదు. అర్జునుడు శ్రీకృష్ణుడి ఇష్టసఖుడు. ఏ కర్మ కారణంగానో అతడు ఈ మృత్యు ప్రపంచంలోకి వచ్చి పడ్డాడు. మోహితమైన ఈ లోకంలో చిక్కుకుపోయిన తన సఖుణ్ని ఈశ్వరోన్ముఖుడిగా చేసి తరింప చేయాలన్న తపనతో అనేక కోణాల్లో వేదాంత బోధ చేశాడా పరమాత్మ. కృష్ణభగవానుడు కేవలం అర్జునుడికి బోధించిందే అయినా సమస్త లోకానికీ జ్ఞానబోధగా భాసిల్లింది గీత. ధర్మరక్షణ కోసం భగవంతుడు ప్రతి యుగంలో అవతరించి మంచిని బోధించి చెడును తుడిచిపెట్టమని చెప్పి వెళ్తూంటాడు. ప్రపంచమంతా ఆ పరమాత్ముడి మాయామయమే. సత్వగుణ సంపన్నులైనవారు జ్ఞానమార్గం, బుద్ధియోగంతో విశేష సాధనచేసి మోక్షాన్ని పొందుతున్నారు. రజో, తమో గుణ సంజాతులకు జ్ఞానోదయం కావాలంటే, వారు ఆధ్యాత్మిక సాధనవైపు ఆకర్షితులు కావాలి. వారి స్థాయిని బట్టి ఉద్ధరించాలనే సంకల్పంతో భగవానుడు వారికి తగిన విధంగానే వేదాంతాన్ని బోధిస్తాడు. సాధన చేసి తరించమని ప్రబోధిస్తాడు.

మనిషి అస్థిర విషయాల వలలో చిక్కుకుని శాశ్వత సుఖానికి దూరమవుతున్నాడు. అఖిల సృష్టినీ ఆవరించి అఖండ జ్యోతిగా వెలుగుతున్న ఈశ్వరుడు మరెక్కడో లేడు. మనిషి దేహంలోనే ఉన్నాడు. అది తెలుసుకోలేక మానవుడు పరమాత్ముడికి దూరమైపోతున్నాడు. అందుకే ‘భక్తుడివై నామీద మనసు నిలిపి పూజ చెయ్యి. నమస్కరించుకో. అప్పుడిక తప్పక నన్నే పొందుతావు’ అంటూ అభయమిస్తున్నాడు పరమాత్ముడు. ఆధ్యాత్మిక పరిపూర్ణ సాధనకు భగవద్గీతను మించింది లేదు. అందులోని ఏ ఒక్క శ్లోకాన్నయినా తీసుకుని సగం చదివినా, విన్నా మనిషికి సద్గతులు కలుగుతాయని వరాహ పురాణం చెబుతోంది. స్వామి వివేకానంద సైతం భగవద్గీత పారాయణకు ఎంతో ప్రాధాన్యమిచ్చేవారు.

నిజానికి ఈశ్వరుడికి వారు, వీరనే భేదం ఉండదు. ప్రతి హృదయంలో కొలువై ఉంటాడు. ఆయన మానసాతీతుడు. రూప రహితుడు. ఆయన ఉనికిని నిర్ధారించలేం. ‘ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మను దర్శించాలంటే మనసు తెరను తొలగించి తీరాలి’ అని విడమరచి చెబుతోంది భగవద్గీత.