
రాజస్థాన్‌లోని భీల్వాడా జిల్లాలో 40 ఏళ్ల క్రితం జ్ఞాపకశక్తి కోల్పోయి కుటుంబానికి దూరమైన ఓ వ్యక్తి.. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కసరత్తుతో తిరిగి తన కుటుంబసభ్యులను కలుసుకున్నాడు. కరేడా పంచాయతీలోని జోగిధోరా గ్రామానికి చెందిన ఉదయ్‌సింగ్ స్వగ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలో చదివేవాడు. వేసవి సెలవుల్లో పని కోసం ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లాడు. అక్కడ ప్రయివేటు కంపెనీలో గార్డుగా పనిచేస్తూ.. ఓ రోడ్డు ప్రమాదం కారణంగా జ్ఞాపకశక్తిని కోల్పోయి ఎక్కడెక్కడో తిరిగాడు. గ్రామంలోని కుటుంబసభ్యులు ఏళ్లతరబడి గాలించినా ఉపయోగం లేకపోయింది. ఈసీ చేపట్టిన ‘సర్’ ప్రక్రియలో భాగంగా బీఎల్వోలు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఈ క్రమంలో జీవన్‌సింగ్ అనే ఉపాధ్యాయుడు ఒకప్పుడు తన సహ విద్యార్థి అయిన ఉదయ్‌సింగ్‌ను గుర్తుపట్టి కుటుంబానికి సమాచారం ఇచ్చారు. కుటుంబసభ్యులు, గ్రామస్థులు డ్రమ్స్, డీజేలతో ఊరేగింపుగా ఉదయ్‌సింగ్‌ను ఇంటికి తీసుకువెళ్లారు. 40 ఏళ్ల తర్వాత కుమారుణ్ని చూసి తల్లి చునీదేవి రావత్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.





