News

యువత ‘‘పంచ పరివర్తన్’’పై దృష్టి సారించాలి : హోసబళే

164views
పంజాబ్ బటిండాలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఆడిటోరియంలో సప్తసింధు ఫోరం ఆధ్వర్యంలో సప్త సింధు ఫోరం యువకుల సమ్మేళనం నిర్వహించింది. దీనికి ముఖ్య వక్తగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోబళే హాజరయ్యారు. ఈ సమ్మేళనానికి పంజాబ్ లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాంట్రాప్రెన్యుయర్స్, పరిశోధకులు, సామాజిక కార్యకర్తలు, అలాగే వివిధ రంగాలలో విశేష కృషి చేస్తున్న ప్రతిభావంతులైన యువకులు హాజరయ్యారు. వీరితో హోసబళే సంభాషించారు.
మొదటగా శ్రీ గురుతేగ్ బహదూర్ త్యాగానికి 350 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నివాళులు అర్పించారు. భారత దేశ చరిత్ర అద్భుతమైందని, దాని నుంచి యువత ప్రేరణ పొందాలని, ఈ ప్రేరణతోనే సమాజంలో పని చేయాలని హోసబళే పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో దైనందిన జీవితంలో వాస్తవికత పునాదిని స్వీయ అనుభవంలోకి తెచ్చుకోవాల్సి వస్తుందని, కేవలం చర్చలతోనే సరిపోదన్నారు.
punjab2
దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంలో యువశక్తి దోహదపడితే, కొన్ని సంవత్సరాలలో అభివృద్ధి చెందిన భారత్ అన్న కల సాకారం అవుతుందన్నారు. యువకులు తమ భవిష్యత్తు, జీవనోపాధి కోసం, సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించడం కోసం ‘‘పంచ పరివర్తన్’’ (కుటుంబ ప్రబోధన్, స్వదేశీ, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమరసత, పౌర విధులు) పై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా యువకులతో ప్రశ్నోత్తరాల సమయం కూడా నడిచింది. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు బదులిస్తూ.. యువత తమ మాతృభాషపై మమకారం పెంచుకుంటూ విరవిగా వాడుకలో వుంచాలన్నారు. వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందాలని, విదేశాలకు వెళ్లకుండా, భారత్ లోనే తమ ప్రతిభను ఉపయోగించాలని కూడా సూచించారు.