
ఈ నెల 25 న అయోధ్య రామాలయంలో ధ్వజారోహణ కార్యక్రమ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దాడుల రోజులు ముగిశాయని, రామాలయంపై మన జెండాను ఎగరవేయబోతున్నామని అన్నారు.
లక్నోలోని జనేశ్వర్ మిశ్రా పార్క్ లో శ్రీకృష్ణ జివో గీతా పరివార్ కార్యక్రమంలో మోహన్ భాగవత్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘మిమ్మల్ని మీరు తెలుసుకోండి. దేశం విషయంలో మనమేంటో అర్థం చేసుకోండి. భారత్ విశ్వగురువుగా వుండేది. అనేక రాజ్యాలతో విలసిల్లేది. చక్రవర్తులు, సామ్రాట్టులు వుండేవారు.ప్రపంచానికి బలమే భారత్.’’ అని పేర్కొన్నారు.
వెయ్యి సంవత్సరాల పాటు భారత దేశాన్ని ఆక్రమణదారులు తమ కాళ్ల తొక్కేశారని, సామ్రాజ్యవాదం కింద జీవించాల్సి వచ్చిందని, అనేక మతపరమైన ప్రదేశాలను ధ్వంసం కూడా చేశారన్నారు.బలవంతపు మాత మార్పిళ్లు ప్రారంభమైనప్పటి నుంచీ భారత్ వుందని, ఇప్పుడు దండయాత్రల శకం ముగిసిందని, మన రామాలయంలో జెండాను ఎగరేయబోతున్నామని ప్రకటించారు.
భారత్ లో యుగయుగాలుగా జీవితానుభవాల ద్వారా స్థిరపడిన జ్ఞాన సారాంశమే గీత అని అభివర్ణించారు.గీత పఠనం అనేది దినచర్యగా మార్చుకోవాలని, ప్రతి రోజూ రెండు శ్లోకాలు చదివి, వాటిని మననం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వాటి సారాన్ని మన మన జీవితాల్లోకి అన్వయించుకోవాలన్నారు. గీతను పఠనం చేసి అర్థం చేసుకోవాలని, ప్రతి సారీ గీత పఠనం చేసినా కొద్దీ.. కొత్తదనాన్ని చూస్తుంటారన్నారు.
నేడు ప్రపంచం మొత్తం భయం, గందరగోళం అన్న స్థితిలోకి పడిపోయిందని, నైతికత లేదని, శాంతి లేదని, సంతృప్తి లేదని, అందువల్ల విశ్రాంతి లేకుండా పోయిందన్నారు. భారత జీవన విధానం మార్గదర్శకమని, అందుకే ప్రపంచానికి భారత్ సరైన మార్గాన్ని చూపిస్తోందని మోహన్ భాగవత్ పేర్కొన్నారు.





