
ఢిల్లీ పేలుడు కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడు, ఆ సమయంలో కారు నడిపిన డా.ఉమర్ నబీకి బాంబుల తయారీలో శిక్షణనివ్వడానికి ఉగ్ర సంస్థలు పాకిస్థాన్ నుంచి బాంబు తయారీ వీడియోలు పంపినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. హంజుల్లా అనే జైషే మహమ్మద్ హ్యాండ్లర్ ఈ వీడియోలను అతడికి పంపినట్లు తెలుస్తోంది. మొత్తం 42 వీడియోలు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ఉగ్ర కుట్రల గురించి నిందితులు టెలిగ్రామ్ యాప్‌లో చర్చించుకునేవారని.. ఇతరులకు అనుమానం రాకుండా ఆయుధాలు, బాంబుల గురించి వంటకాల పేర్లను సీక్రెట్ కోడ్‌లుగా వాడేవారని అధికారులు తెలిపారు. పేలుడు పదార్థాలకు బిర్యానీ అని, ఉగ్ర ఘటనలు అమలుచేయడానికి దావత్ అని కోడ్ నేమ్‌లను ఉపయోగించినట్లు గుర్తించారు.
అక్టోబర్‌లో జమ్మూకశ్మీర్‌లోని నౌగామ్‌లో జైషే మహ్మద్ పోస్టర్లు కలకలం సృష్టించడంతో ఈ ఉగ్ర కుట్రలపై దర్యాప్తు మొదలైన విషయం తెలిసిందే. ఆ పోస్టర్లపై ‘కమాండర్ హంజుల్లా భాయ్’ అనే పేరు రాసి ఉన్నట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. పాక్ హ్యాండ్లర్ హంజుల్లా జమ్మూకశ్మీర్‌లోని షోపియన్‌కు చెందిన మౌల్వి ఇర్ఫాన్అహ్మద్ అనే ఉగ్రవాద మద్దతుదారు ద్వారా ఉగ్ర నెట్‌వర్క్‌లో ఒకరైన ముజమ్మిల్ షకీల్‌తో టచ్‌లోకి వచ్చినట్లు తెలిపారు. అతడి ద్వారా ఉమర్ సహా పలువురు వైద్యులను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించి ‘వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్’ను ఏర్పాటుచేశాడు. షకీల్ మిగిలిన వైద్యులకు పేలుడు పదార్థాలను రవాణా చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. దిల్లీ పేలుడుకు కారణమైన కారును కూడా అతడే ఉమర్‌కు అప్పగించినట్లు తెలిపారు.
దిల్లీలో ఉగ్ర దాడులు చేయడానికి వీరు కొన్నేళ్లుగా ప్రణాళికలు రచిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. 2022లో ముగ్గురు ఉగ్ర డాక్టర్లు తుర్కియేలో పర్యటించిన సమయంలో పాక్ హ్యాండ్లర్ అక్కడ వారు సిరియాకు చెందిన ఆపరేటివ్‌తో సమావేశాన్ని ఏర్పాటుచేసినట్లు అధికారులు గుర్తించారు. అందులో వారు బాంబుల తయారీ, ఉగ్రదాడుల ప్రణాళికలపై చర్చలు జరిపినట్లు సమాచారం. దిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్‌లోని హై ప్రొఫైల్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఈ వైట్‌కాలర్ టెర్రర్ బృందం 200 శక్తివంతమైన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (IED)లను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. దాడుల కోసం దిల్లీ పేలుడులో ఉపయోగించిన కారుతో పాటు మరో రెండు కార్లను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు ఉగ్ర కేసులో అరెస్టైన వైద్యులతో సంబంధమున్న అల్-ఫలా విశ్వవిద్యాలయంపై దర్యాప్తునకు ఫరీదాబాద్ పోలీసులు సిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.





