News

13వ పంచగవ్య ముగింపు సదస్సులో విశ్వప్రసన్న తీర్థస్వామి

141views

‘ప్రాచీన కాలంలో ప్రతి దేవస్థానంలో పంచగవ్యను ప్రసాదంగా ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఇందుకు కారణం దేశీ ఆవులు కనుమరుగవడమే’ అని ఉడిపి పేజావర అధోక్ష మఠం జగద్గురు విశ్వప్రసన్న తీర్థస్వామి తెలిపారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో మూడు రోజులుగా కొనసాగుతున్న 13వ పంచగవ్య జాతీయ వైద్య సమ్మేళనం ముగింపు సదస్సు ఆదివారం నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పంచగవ్యను ఔషధంగా కాకుండా ఆహారంగా తీసుకుంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని.. ఇదే అధర్వణ వేదంలోనూ ఉందని పేర్కొన్నారు. గోమాత పరిరక్షణకు ఉడిపిలోని తమ మఠం కృషి చేస్తుందని, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.

అనంతరం గవ్య సిద్ధ వైద్యులు ఆచార్య జీవన్‌కుమార్‌ నాయుడు మాట్లాడుతూ.. దేశీ ఆవులు ఉన్న ఇల్లు వైద్యాలయంగా, దేవాలయంగా శోభిల్లుతుందన్నారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఒంగోలు గిత్త, ఆవులను అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారని, దీన్ని అడ్డుకోవాలని సూచించారు. పుంగనూరు ఆవుల సంరక్షణ సైతం ఆశాజనకంగా లేదని వాపోయారు. సదస్సు చివరిరోజు 150 మంది ప్రముఖులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు తరలివచ్చారు. గోమాత స్పర్శ, 16వ గవ్య, విత్‌ శరీర సమతౌల్యం అనే అంశాలపై చర్చించారు. పంచగవ్య విద్యాపీఠం నుంచి కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు ధ్రువపత్రాలు అందించారు. పంచగవ్య విద్యాపీఠం ఉప-గురుకులపతి డా.కమల్‌ తాయోరి, పంజాబ్‌ శ్రీమద్‌ భగవత్‌ కథ వాచక్‌ శ్రీధరాచార్య మహరాజ్, ఆచార్య మదన్‌సింగ్‌ కుశ్వాహ, ఆచార్య రణవీర్‌ కేఆర్‌ సింగ్, ఆమోద్‌ కేల్కర్, పంచగవ్య గురుకులం సభ్యులు భవనేశ్‌ దేవర, శ్రీకృష్ణన్‌ పటేల్, పరంధామన్‌ తదితరులు పాల్గొన్నారు.