
ఉగ్రవాదులకు సాయం చేస్తూ పోలీసులకు చిక్కిన శ్రీనగర్ డీఎస్పీ దవీందర్ సింగ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దర్యాప్తు ప్రారంభించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన ఎన్‌ఐఏ.. డీఎస్పీపై కేసు నమోదు చేసింది. వచ్చే సోమవారం ఎన్‌ఐఏ బృందం కశ్మీర్ వెళ్లి విచారణ నిమిత్తం దవీందర్‌ను దిల్లీకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఆయన కారు, నివాసంలో లభించిన ఏకే-47, గ్రనేడ్లు, పిస్టోల్, మొబైల్ ఫోన్‌లను ఫోరెన్సిక్ విభాగానికి పంపించనున్నారు.
హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను తన కారులో ఎక్కించుకుని వెళ్తున్న దవీందర్ సింగ్‌ను గతవారం జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం కేసును ఎన్‌ఐఏకు అప్పగించారు. అయితే దేవిందర్ కేసును ఎన్‌ఐఏకు అప్పగించడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పుల్వామా డీఎస్పీగా దవీందర్ ఉన్నప్పుడే అక్కడ దాడి జరిగిందని, దీనిపై ఆయనను నోరు మెదపకుండా చేసేందుకే ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారని ఆరోపించింది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





