
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అవధ్ శాఖ గొప్ప కార్యక్రమాన్ని స్వీకరించింది. లక్నోలోని కైసర్ బాగ్ లోని ఏబీవీపీ ప్రాంతీయ కార్యాలయంలో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసింది.ఈ ఎగ్జిబిషన్ ను ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచారక్ ప్రముఖ్ స్వాంత రంజన్ ప్రారంభించారు.విశిష్ట అతిథులుగా ఎబివిపి జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ (డాక్టర్) రాజ్‌శరణ్ షాహి మరియు శాసనమండలి సభ్యుడు పవన్ సింగ్ చౌహాన్ ఉన్నారు.
ఈ ఎగ్జిబిషన్ లో ఆరెస్సెస్ వందేళ్ల ప్రయాణంలో కీలక మైలు రాళ్లు, సామాజిక సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రచారాలతో పాటు సంఘ్ లోని కీలక కార్యక్రమాలు, అలాగే నిర్మాణాత్మక కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను ఇందులో ప్రదర్శించారు.
ఈసందర్భంగా అఖిల భారతీయ ప్రచారక్ ప్రముఖ్ స్వాంత రంజన్ మాట్లాడుతూ గత 100 సంవత్సరాలుగా ఆరెస్సెస్ సమాజానికి సానుకూల దిశానిర్దేశం చేసిందని పేర్కొన్నారు. అలాగే అనేక సేవా కార్యక్రమాల ద్వారా దేశానికి సేవలు చేస్తూ వస్తోందని తెలిపారు. ఇక.. ఇక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ సంఘ్ వందేళ్ల ప్రయాణాన్ని పూర్తిగా కళ్లముందు వుంచిందని, వీటిని చూడటం ద్వారా కార్యకర్తల్లో స్ఫూర్తిని నింపుతుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కార్యకర్తలను ఆయన అభినందించారు. ఈ ప్రదర్శన కేవలం ఆర్‌ఎస్‌ఎస్ కృషిని ప్రదర్శించడమే కాదు, దేశ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తుందని అన్నారు.





