News

కర్నాటకలో ‘‘ఐ లవ్ ఆరెస్సెస్’’ క్యాంపెయిన్

220views

ప్రభుత్వ స్థలాల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకలాపాలను నిషేధించాలంటూ కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన డిమాండ్ పై కర్నాటక అంతటా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అదో ముస్లిం సంతుష్టీకరణ చర్య అంటూ జాతీయవాదులు విరుచుకుపడుతున్నారు. మరో వైపు దీనికి విరుగుడుగా జాతీయవాదులు, బీజేపీ నేతలు ‘‘ఐ లవ్ ఆరెస్సెస్ ((I love rss) అంటూ ఓ ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించారు.

ప్రియాంక్ ఖర్గే స్వస్థలమైన కలబురిగిలో ఈ క్యాంపెన్ సాగుతోంది. భారత్ ను ప్రేమించే వారు ఆరెస్సెస్ ను కూడా ప్రేమిస్తారు’’ అన్న పోస్టర్లు వీధుల్లో ప్రత్యక్షమయ్యాయి.ఈ క్యాంపెయిన్ లో జాతీయవాదులు భారీ సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కలబురిగిలోని రద్దేవాడగి లాంటి ప్రధాన జెంక్షన్లలో, ప్రజా ప్రదేశాలలో పోస్టర్లను అతికించారు.ఈ చిన్న చర్య… అత్యంత వేగంగా ఉద్యమంగా మారిపోయింది.

ఒక శతాబ్దం పాటు ఐక్యత, క్రమశిక్షణ, దేశ సేవకు చిహ్నంగా నిలిచిన ఓ సంస్థను అప్రతిష్ఠ పాలు చేయడానికి ప్రియాంక్ ఖర్గే ప్రయత్నిస్తున్నారని జాతీయవాదులు మండిపడ్డారు. ‘‘దేశ వ్యాప్తంగా సంఘ్ దేశభక్తిని ప్రేరేపిస్తుంది. ఇది మంత్రికి తెలియదా? దేశం మొత్తం ఆరెస్సెస్ కార్య శతాబ్దిని జరుపుకుంటోంది. ప్రియాంక్ ఖర్గే అనవసరంగా వివాదాన్ని లేవనెత్తారు’’ అంటూ మండిపడుతున్నారు.

ప్రియాంక్ ఖర్గే ఆరెస్సెస్ గురించి మాట్లాడకపోతే.. ఆయనకు ఆహారం జీర్ణంకాదు. ప్రియాంక్ ఖర్గే ఎదుగుదల అంతా తండ్రి కారణంగానే. తన తండ్రి ఆశీస్సుల వల్లే ఆయన తొలి సారి ఎమ్మెల్యే, మంత్రి అయ్యారు. ఆయనకు ఆరెస్సెస్ గురించే తెలియదు’’ అని ఎద్దేవా చేస్తున్నారు.

కర్నాటక కాంగ్రెస్ మంత్రి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే చేసిన పని లక్షలాది మంది హిందువులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ప్రతిరోజూ భారత దేశ పరమ వైభవ స్థితి కోసం, దేశం, ధర్మం కోసం పనిచేసే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకలాపాలను ప్రభుత్వ స్థలాల్లో నిషేధించాలంటూ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు లేఖ రాశారు. దీంతో కర్నాటకతో పాటు దేశ వ్యాప్తంగా రాజకీయ తుపాను రేగుతోంది.

ప్రభుత్వ మైదానాలు, ఉద్యానవనాలు, పాఠశాలల ఆవరణలు, క్రీడ మైదానాలు తదితర ప్రభుత్వ స్థలాల్లో ఆరెస్సెస్ శాఖలు, బైఠక్ లు, సాంఘీక్ (వారం వారం జరిగే కార్యక్రమం) లాంటి కార్యక్రమాలు అనుమతులు మంజూరు చేయవద్దని, వాటిని నిషేధించాలని మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆ లేఖలో పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే పాఠశాలలు, కళాశాలల మైదానాలు, ప్రభుత్వ స్థలాల్లో సంఘ్ తన కార్యక్రమాలను నిర్వహిస్తూ, లౌకికవాదం, భారతీయ ఐక్యతకు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తుంటారని, రాజ్యాంగ ఆశయాలకు వ్యతిరేకంగా విషభావాలను నింపుతున్నారని ఖర్గే తన లేఖలో లేనిపోని ఆరోపణలకు దిగారు. అలాగే యువత మనస్సుల్లో విష భావాలను, విభజన వాదాన్ని నింపుతున్నారని ఆరోపించారు.