
మావోయిస్టుల చరిత్రలోనే అతి పెద్ద లొంగుబాటు చోటుచేసుకుంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో ఒకేసారి ఏకంగా 139 మంది లొంగిపోయారు. ఆయుధాలను అప్పగించి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొచ్చారు. వారిలో మావోయిస్టు పార్టీకి దశాబ్దాలపాటు అత్యంత కీలక నాయకుడిగా వ్యవహరించిన మల్లోజుల వేణుగోపాల్‌రావు ఎలియాస్ భూపతి అలియాస్ సోను ఉన్నారు. గత రెండు మూడు రోజులుగా ఆయుధాలను త్యజించిన వారి వివరాలు బుధవారం అధికారికంగా వెల్లడయ్యాయి. గడ్చిరోలిలో జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సమక్షంలో మల్లోజులతో పాటు మరో 60 మంది, ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, కాంకేర్, కొండగావ్ జిల్లాల్లో అధికారుల సమక్షంలో 78 మంది లొంగిపోయారు.
రూ.6 కోట్ల రివార్డున్న మల్లోజుల..
మల్లోజుల వేణుగోపాల్ తలపై రూ.6 కోట్ల రివార్డుంది. ఆయనతో కలిసి 60 మంది మావోయిస్టులు ఆయుధాలను వదిలేశారు. వారంతా 54 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. అందులో ఏకే-47లు, ఇన్సాస్ రైఫిళ్లు ఉన్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్లాటూన్ ఆపరేషన్లను నిర్వహించడంతోపాటు మావోయిస్టుల వ్యూహకర్తగా మల్లోజుల వ్యవహరించారు. రెండ్రోజుల కిందే వీరంతా పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోయారు.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, కాంకేర్, కొండగావ్ జిల్లాల్లో 78 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో ఇద్దరు దండకారణ్య జోనల్ కమిటీ సభ్యులున్నారు. మావోయిస్టు పార్టీలో అత్యంత శక్తిమంతమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీజీఎల్‌ఏ) బెటాలియన్-1 సభ్యుడైన 53 ఏళ్ల ఓయం లఖ్ము లొంగిపోయిన వారిలో ఉన్నాడు. లొంగిపోయిన వారందరికీ రూ.50,000 చొప్పున అందించారు. దండకారణ్య జోనల్ కమిటీ సభ్యులు రాజ్‌మన్ మాండవీ, రాజు సలాం ఆధ్వర్యంలో ఒక్క కాంకేర్ జిల్లాలో 32 మంది మహిళలతో సహా 50 మంది లొంగిపోయారు. 2023 నుంచి ఇప్పటిదాకా ఛత్తీస్‌గఢ్‌లో 2,000 మంది దాకా నక్సల్స్ లొంగిపోయారని అధికారులు తెలిపారు.
నమ్మకమైన మధ్యవర్తులతో..
భమ్రాగఢ్ అటవీ ప్రాంతంలో నమ్మకమైన మధ్యవర్తుల ద్వారా పోలీసులు చర్చలు కొనసాగించారు. చివరకు 10 రోజుల కిందట.. లొంగిపోతానన్న తన మాటకు మల్లోజుల కట్టుబడి ఉంటారని ఫోడేవాడ గ్రామస్థులతో ఆయన జరిపిన సంభాషణలతో తేలిపోయిందని పోలీసులు గుర్తించారు. ఈ నెల 13వ తేదీ ఉదయానికల్లా ప్రభుత్వంతో చర్చలు పూర్తయ్యాయి. అదే రోజు సాయంత్రం భమ్రాగఢ్ తాలూకాలోని హోదరి గ్రామంలో సహచరులతో కలిసి లొంగిపోయేందుకు వస్తున్నారని సందేశం వచ్చింది. మల్లోజుల 13వ తేదీ రాత్రి మరో 60 మందితో కలిసి వచ్చారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కట్టుదిట్టమైన భద్రత మధ్య గడ్చిరోలికి తరలించారు.
1,639 మంది లొంగిపోయారు: కేంద్రం
దేశంలో ప్రస్తుతం నక్సలైట్ల తీవ్ర ప్రభావం 3 జిల్లాలకే పరిమితమైందని కేంద్ర హోంశాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్, సుక్మా, నారాయణ్‌పుర్ జిల్లాల్లోని ఇంకా తీవ్రంగా వారి కార్యకలాపాలు కొనసాగుతున్నాయని వివరించారు. ఇప్పటిదాకా 312 మంది నక్సల్స్‌ను హతమార్చామని, 836 మందిని అరెస్టు చేశామని, 1,639 మంది లొంగిపోయారని పేర్కొన్నారు.
రెడ్ కారిడార్‌కు త్వరలో స్వేచ్ఛ: ఫడణవీస్
ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లో విస్తరించిన రెడ్ కారిడార్‌కు త్వరలో స్వేచ్ఛ కల్పిస్తామని ఫడణవీస్ స్పష్టం చేశారు. గడ్చిరోలిలో ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలోనే మల్లోజుల లొంగుబాటు అతి పెద్దదని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి 100 మందిదాకా లొంగిపోనున్నారని తెలిపారు.





