
పురాతన కాలంలో సిద్దవటంలోని పెన్నానది ఒడ్డున వెలసిన ఆంజనేయస్వామి కోవెల ముళ్ల కంపచెట్ల మధ్య అధ్వానంగా తయారైంది. కట్టడాలు దెబ్బతిని శిథిలావస్థకు చేరాయి. మరికొన్ని కట్టడాలు నేలకూలాయి. ఆలయ మాన్యంలోని కొన్ని ఎకరాలు అన్యాక్రాంతం కాగా మరికొన్ని ఎకరాలు నిరుపయోగంగా మారాయి. గర్భగుడిలో పలుమార్లు గుప్తనిధి తవ్వకాలు జరిగి ధ్వంసమైంది. ఇన్ని రకాలుగా కోవెలలో పరిస్థితులున్నా దేవాదాయ శాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరించడంపై భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ విషయం : వైయస్సార్ కడప జిల్లా సిద్దవటంలోని ఆంజనేయస్వామి కోవెల పురాతన కాలంలో ఎంతో విశేషంగా వెలుగొందింది. భక్తుల ఆరాధ్య దైవంగా ప్రాచుర్యం పొందింది. దేవదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ కోవెల పేరిట వంతాటిపల్లెలోని సర్వే సంఖ్య 1185లో 1.80 ఎకరాల భూమి ఉండేది. ప్రధాన రహదారి పక్కన ఉన్న ఈ భూమిలో గతంలో మామిడి తోట ఉండటంతో ఆలయానికి ఆదాయ వనరుగానూ ఉండేది. క్రమంగా చెట్లు నేలకూలి కాలగర్భంలో కలిసిపోయాయి. ఆ భూమిలో స్థానికులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరపడంతో గుంతలమయంగా మారింది.
మాన్యంలో స్థానికేతరులు కొందరు అన్యాక్రాంతం చేసి నివాస గృహాలు నిర్మించారు. అనంతరం కొన్నేళ్ల కిందట గ్రామ పంచాయతీ భవనం, గ్రామ సచివాలయ భవనాలు నిర్మించారు. ఇటీవల ఎంపీ నిధులతో శుద్ధి జలకేంద్రం భవనం కూడా నిర్మించారు. దీంతో ఆలయ మాన్యమంతా అన్యాక్రాంతమైంది.
సిద్దవటంలో సర్వే సంఖ్య 400లోని 0.06 సెంట్ల ఆలయ స్థలాన్ని గతంలో స్థానిక ఓ వ్యక్తి అక్రమంగా తన పేరిట మార్పించుకున్నారు. ఆలయం పక్కనే ఉన్న సర్వే సంఖ్య 399/1, 399/2లో ఉన్న 1.65 ఎకరాల భూమి ధర్మకర్త పేరిట ఉంది. కొన్నేళ్లగా ఆ భూమి వినియోగంలో లేక నిరుపయోగంగా దర్శనమిస్తోంది. ప్రస్తుతం ఆ భూమిలో ముళ్లకంపచెట్లు, పిచ్చిమొక్కలు దట్టంగా పెరిగాయి.
కట్టడాల కూల్చివేత: దశాబ్దాలుగా కోవెలలో పూజలు జరగకపోవడంతో పురాతన కట్టడాలు శిథిలావస్థకు చేరాయి. కోవెల పరిసరాల్లో సక్రమంగా జనసంచారం లేకపోవడంతో పలుమార్లు దుండగులు గుప్త నిధుల కోసం మూలవిరాట్ కింద తవ్వకాలు జరిపి ధ్వంసం చేశారు. మూడేళ్ల కిందట స్థానిక వ్యక్తి తాను విరాళాలు సేకరించి నూతన కట్టడాలు నిర్మిస్తానంటూ గుడి ఆవరణలోని పురాతన కట్టడాలను యంత్రంతో కూల్చేశారు. అనంతరం నిర్మాణ పనులు చేపట్టకుండా వదిలేశారు.





