News

వయో వృద్ధుల దర్శనంపై ఆ వదంతులు నమ్మొద్దు: తితిదే

257views

వయో వృద్ధుల దర్శనంపై జరుగుతోన్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని శ్రీవారి భక్తులకు తితిదే మరోసారి విజ్ఞప్తి చేసింది. ఈ దర్శనంపై తప్పుదోవ పట్టించేలా సామాజిక మాధ్యమాల్లో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘అసలు వాస్తవం ఏమిటంటే.. రోజూ 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం తితిదే మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తుంది. టికెట్ పొందిన వ్యక్తికి రూ.50 లడ్డూ ఉచితంగా ఇస్తుంది. తిరుమల నంబి ఆలయానికి ఆనుకొని ఉన్న సీనియర్‌ సిటిజన్‌/పీహెచ్‌సీ లైన్‌ ద్వారా రోజూ మధ్యాహ్నం 3గంటలకు శ్రీవారి దర్శనానికి వారిని అనుమతిస్తారు’’ అని తితిదే స్పష్టం చేసింది. అందువల్ల సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యే తప్పుడు వార్తలు, వదంతులను నమ్మొద్దని తితిదే విజ్ఞప్తి చేసింది. సరైన సమాచారం కోసం భక్తులు తితిదే అధికారిక వెబ్‌సైట్‌ www.tirumala.org, https://ttdevastanams.ap.inను మాత్రమే సంప్రదించాలని కోరారు.

అది తితిదే రహదారి కాదు..
తిరుమల వెళ్తున్న భక్తులకు మందుబాబులు నరకం చూపిస్తున్నారంటూ జరుగుతోన్న ప్రచారాన్ని సైతం తితిదే ఖండించింది. అలిపిరి మెట్ల మార్గం వద్ద మద్యం తాగి మత్తులో మందుబాబులు ఆ సీసాలను పగులగొట్టి వేశారంటూ కొందరు అవాస్తవ ప్రచారం చేస్తున్నారని తెలిపింది. అలిపిరి నుంచి రుయా ఆస్పత్రికి వెళ్లే మార్గంలో కొందరు ఆకతాయిలు పగిలిన గాజు సీసా ముక్కలు రోడ్డుపై విసిరి వేశారని తెలిపింది. వాస్తవానికి అది తితిదే రహదారి కాదని పేర్కొంది. అయినా కొందరు అలిపిరి మెట్ల మార్గం వద్ద భక్తులకు ఇబ్బంది అని వక్రీకరిస్తున్నారని మండిపడింది. ఇలాంటి అసత్య వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.