ArticlesNews

పైడితల్లి సిరిమానోత్సవం– వందల ఏళ్లుగా ఉత్తరాంధ్రలో జరుగుతున్న ఈ ఉత్సవ విశేషాలు ఇవే!

286views

జగన్మాత ఎన్నో రూపాలతో, మరెన్నో పేర్లతో భక్తులను అనుగహిస్తుంటుంది. ఇటు నవదుర్గలుగా, అటు గ్రామ దేవతలుగా కూడా అమ్మవారు తన లీలలు ప్రదర్శిస్తూ ఉంటుంది. ఆశ్వయుజం మాసం ఆరంభంలో 10 రోజుల పాటు దేవి నవరాత్రులు, దసరా పండుగతో కోలాహలంగా గడిచిపోయింది. ఇక దసరా పండుగ పూర్తి కాగానే వచ్చే మరో ఉత్సవం పైడితల్లి సిరిమాను ఉత్సవం.

పైడితల్లి సిరిమాను ఉత్సవాలు ఎప్పుడు?
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం అయిన పైడితల్లి జాతర ఆంధ్ర ప్రాంతంలో జరిగే అతి పెద్ద జాతర! తోలేళ్ల ఉత్సవంతో మొదలై, ఉయ్యాల కంబాల జాతరలో పూర్తయ్యే సిరిమాను సంబరాలకు ఏర్పాట్లు రెండు నెలల ముందే మొదలవుతాయి.

అసలు ఎవరీ పైడితల్లి?
ఉత్తరాంధ్ర వాసుల కల్పవల్లి పైడితల్లి గజపతుల వారి ఆడపడుచు. విజయనగరంలో వెలసిన శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం 18వ శతాబ్దంలో నిర్మించినట్లుగా తెలుస్తోంది. చారిత్రక ఆధారాల ప్రకారం విజయనగరం రాజు బొబ్బిలి రాజుకు మధ్య జరిగిన యుద్ధంలో బొబ్బిలి కోట దాదాపుగా ధ్వంసమైంది. యుద్ధం జరిగే సమయంలో రామరాజు సోదరి పైడిమాంబ మసూచి వ్యాధితో బాధపడుతున్నారు. ఆ సమయంలో పైడిమాంబ పూజ నిర్వహిస్తుండగా అతని సోదరుడు కష్టాల్లో ఉన్నాడని తెలిసింది. ఈ యుద్ధంలో తాండ్ర పాప రాయుడు రాజు విజయ రామరాజును సంహరించాడు. సోదరుని మరణ వార్త తెలిసి పైడిమాంబ దుఃఖంతో తనువు చాలిస్తుంది.

స్వప్న సందేశం
పైడిమాంబ మరణానంతరం ఆ రాజ్యంలో ఒక సైనికుడైన పతివాడ అప్పల నాయుడుకి కలలో కనిపించి ఓ సందేశాన్ని అందిస్తుంది. అదేమిటంటే ఆ ప్రాంతంలోని ఓ సరస్సులో పడమర వైపు నుంచి వెతికితే తన విగ్రహం దొరుకుతుందని, ఆ విగ్రహాన్ని ఆ స్థలంలో ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించమని చెప్పింది. ఆ ఆలయంలో నిత్యం పూజలు, ఉత్సవాలు చేయమని చెప్పి ఆమె దేవిలో ఐక్యమయ్యింది. ఆనాటి నుంచి ఆలయంలో నిత్య పూజోత్సవాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.

మంగళవారంతో మంగళకరంగా
సాధారణంగా దసరా పండుగ తర్వాత వచ్చే మొదటి మంగళవారం రోజున సిరిమానోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. కొన్ని ఏళ్లుగా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 7 వ తేదీ పైడితల్లి సిరిమాను ఉత్సవం జరుగనుంది. వాస్తవానికి సిరిమాను ఉత్సవాలు లాంఛనంగా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.

సిరిమాను షెడ్యూల్!
సెప్టెంబరు 12 , చదురు, వనంగుడి వద్ద పందిరిరాటతో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ నుంచి అక్టోబరు 22 వరకు మండల దీక్షలు ఉంటాయి. అక్టోబర్‌ 6 తోలేళ్ల ఉత్సవం, అక్టోబర్ 7 మంగళవారం అమ్మవారి సిరిమానోత్సవం జరుగుతుంది. అక్టోబరు 14 మంగళవారం తెప్పోత్సవం, ఉయ్యాల కంబోత్సవం నిర్వహిస్తారు. చివరి రోజు వనంగుడిలో చండీహోమం, పూర్ణాహుతితో దీక్షలు ముగుస్తాయి.

తోలేళ్ల ఉత్సవం
అక్టోబర్‌ 6 సోమవారం తోలేళ్ల ఉత్సవం జరుగుతుంది. రైతులు పొలాన్ని దున్నే నాగలిని ఉత్తరాదిలో ‘ఏరు’ అని కూడా అంటారు. అమ్మవారి అనుగ్రహంతో వచ్చిన విత్తనాలను తొలుత దున్నే ఉత్సవాన్ని ‘తొలి’ ‘ఏరు’ అని అనే వారు అదే కాలక్రమేణా తోలేళ్ల ఉత్సవంగా మారింది. ఈ ఉత్సవం సందర్భంగా ఈ రోజు రాత్రి చదురు గుడి నుంచి అమ్మవారి ఘటాలను విజయనగరం కోటలోకి తీసుకెళ్తారు. అక్కడ కోటకు పూజ చేసి అమ్మవారి ఆశీర్వాదం పొందిన విత్తనాలను బస్తాలలో ఉంచుతారు. అనంతరం పూజారి చేతుల మీదుగా రైతులు ఆ విత్తనాలను అందుకొని తమ పొలంలో చల్లే విత్తనాల బస్తాలలో వాటిని కలుపుతారు. ఈ ఉత్సవంలో అందించిన విత్తనాలతో సాగు చేస్తే పంటలు సమృద్ధిగా పండుతాయని విశ్వాసం.

అంతా అమ్మవారి ఆదేశం మేరకే!
పైడితల్లి అమ్మవారి విగ్రహాన్ని చెరువులో నుంచి బయటకు తీసిన పతివాడ వంశీయులే ఇప్పటికీ ఈ ఆలయ పూజారులుగా కొనసాగుతున్నారు. సిరిమాను ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అమ్మవారి స్వయంగా పర్యవేక్షిస్తారని విశ్వాసం. అందుకు నిదర్శనంగా సిరిమానోత్సవానికి నెల రోజుల ముందు పైడితల్లి అమ్మవారు ఆలయ పూజారికి స్వప్నంలో సాక్షాత్కరించి సిరిమాను చెట్టు ఎక్కడుందో చెబుతారు. అమ్మవారు సూచించిన చింతచెట్టునే సిరిమానుగా ఉపయోగిస్తారు. ఆ చెట్టు యజమానితో మాట్లాడి సిరిమానును సిద్ధం చేస్తారు.

సిరిమాను సిద్ధం
నిపుణులైన వడ్రంగులు సిరిమాను చెక్కుతుండగా ప్రజలు నీళ్లు, పసుపు చల్లుతూ మొక్కులు తీర్చుకుంటారు.

కమనీయం సిరిమాను ఉత్సవం
సుమారు 60 అడుగుల పొడవైన సిరిమాను చివర పూజారి కూర్చున్న తర్వాత సిరిమాను పైకి లేస్తుంది. ఈ సిరిమాను విజయనగరం పట్టణంలోని మూడు లాంతర్ల జంక్షన్ నుంచి కోట వరకు మూడుసార్లు తిరుగుతుంది. ఈ సందర్భంగా రాజకుటుంబీకులు, ప్రముఖులు కోట బురుజు దగ్గర కూర్చుని పైడితల్లి అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారి రూపంగా భావించే సిరిమానును అధిరోహించిన పూజారి ప్రజలందరికీ దీవెనలు అందిస్తారు. సిరిమానోత్సవంలో బెస్తవారి వల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

మహాప్రసాదం
ఉత్సవం పూర్తయ్యాక పూజారి అధిరోహించిన సిరిమానును చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ ముక్కలను భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు.

ధనధాన్యాలు అందించే సిరిమాను ప్రసాదం
ఉత్సవంలో పంచిపెట్టిన సిరిమాను ప్రసాదాన్ని భక్తులు మహాప్రసాదంగా భావించి తమ ఇంటికి తీసుకెళ్లి పూజామందిరంలో ఉంచుకుని పూజ చేస్తారు. ఈ సిరిమాను ప్రసాదం తమ ఇంట్లో సిరులు నింపుతుందని భక్తుల విశ్వాసం. కొందరు ఈ సిరిమాను ప్రసాదాన్ని తమ పొలంలో రక్షగా ఉంచుతారు. కొందరు రైతులు తమ పొలాల్లో ఈ ప్రసాదాన్ని విత్తనాలతో పాటు చల్లుతారు. ఇలా చేయడం వలన పంటలు సమృద్ధిగా పండుతాయని నమ్మకం. చివరగా అక్టోబరు 14 మంగళవారం తెప్పోత్సవం, ఉయ్యాల కంబోత్సవంతో నెల రోజుల పాటు కొనసాగిన పైడితల్లి సిరిమాను ఉత్సవాలు ముగుస్తాయి.

సిరిమాను ఉత్సవం! భక్తులకు సంబరం!
విజయనగరంలో అతి ప్రాచీన కాలం నుంచి జరుగుతున్న ఈ పైడితల్లి సిరిమాను ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి కూడా లక్షలాదిమంది భక్తులు తరలి వస్తారు. పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతరంటే భక్తులకు ఎంతో సంబరం. జీవితంలో ఒక్కసారైనా ఆ జాతరను చూసి తరించాలని తపించే వారు ఎందరో!