
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకుని నాగ్‌పూర్‌లోని రేషంబాగ్ మైదానంలో జరిగిన విజయదశమి వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ హాజరవ్వగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ విజయ దశమి ఉత్సవ ప్రసంగం చేశారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ముందుగా రేషింబాగ్ లోని ఆధ్య సర్‌సంఘ్‌చాలక్ డాక్టర్ హెడ్గేవార్, ద్వితీయ సర్‌సంఘ్‌చాలక్ గోళ్వాల్కర్ (గురూజీ) స్మృతి మందిరాల వద్ద పుష్పాంజలి ఘటించారు. తదనంతరం పరంపరగా వస్తున్న శస్త్ర పూజను మోహన్ భాగవత్ తో కలిసి నిర్వహించారు. అయితే మొదటిసారిగా, ఈసారి సాంప్రదాయ ఆయుధ పూజతో పాటు ఆధునిక సైనిక పరికరాల ప్రతిరూపాలను చేర్చి శస్త్ర పూజ నిర్వహించారు. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది.
మామూలుగా అయితే సంఘ శస్త్రపూజలో భాగంగా కత్తులు, ఈటెలు, విల్లులు ,బాణాలు వంటి ఆయుధాలను పూజించేది, కానీ ఈ సంవత్సరం, ఆపరేషన్ సిందూర్‌లో ఉపయోగించిన అధునాతన డ్రోన్‌ల ప్రతిరూపాలు . స్వదేశీ పినాకా-శక్తితో పనిచేసే అగ్నిబాన్ ప్రయోగ వ్యవస్థలను పూజించారు. ఇది సంప్రదాయం , సాంకేతికతో కూడిన అద్భుతమైన కలయికగా అందరూ పేర్కొంటున్నారు.
ఈ సంవత్సరం ముఖ్యాంశం ఆపరేషన్ సిందూర్‌లో ఉపయోగించిన హైటెక్ డ్రోన్ యొక్క ప్రతిరూపం. దీనిని మొదటిసారిగా బహిరంగంగా ప్రదర్శించారు, ప్రేక్షకులు, స్వయం సేవకులందరూ గర్వంగా, ఉత్సాహంగా దీన్ని చూశారు. ఇక చంద్రపూర్ , అంబాజారి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో తయారు చేయబడిన, పూర్తిగా స్వదేశీ పినాకా ఆధారిత అగ్నిబాన్ ప్రయోగ వ్యవస్థ యొక్క ప్రతిరూపాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజల గౌరవార్థం ప్రదర్శించారు. ఇది భారతదేశం యొక్క స్వావలంబన , రక్షణ సామర్థ్యానికి చిహ్నంగా చెప్పవచ్చు.





